
చికిత్స పొందుతున్న లక్ష్మణరావు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ఫేస్‌బుక్ ద్వారా పరిచయ మైన ఓ యువతి తనతో వివాహానికి అంగీకరించలేదనే ఆగ్రహం తో ఓ ఉన్మాది బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. విశాఖలోని వుడా పార్కులో సోమవారం మధ్యాహ్నం ఈ ఘాతుకం జరిగింది. కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లికి చెందిన కర్నాటి నాగ లక్ష్మణరావు (24) మూడేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(19)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. బాధిత యువతి విశాఖలోని ఓ హాస్టల్‌లో ఉంటూ బీఎస్సీ చదువుతోంది.
అయితే ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించి ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం విశాఖ బీచ్‌లోని వుడా పార్కుకు వెళ్లిన వీరి మధ్య దీనిపై ఘర్షణ చోటుచోసుకుంది. దీంతో నాగ లక్ష్మణరావు బ్లేడుతో దాడి చేసి ఆమె గొంతు కోశాడు. బాధితురాలి కేకలు విని సమీపంలో ఉన్నవారు రావటంతో లక్షణరావు తన మెడపై కూడా బ్లేడుతో కోసుకున్నాడు. బాధితురాలు ప్రస్తుతం కోలుకుంటోంది. లక్ష్మణరావు ప్రేమ ప్రతిపాదన తేగా తాను తిరస్కరించటంతో గొంతు కోసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. లక్ష్మణరావు తెలంగాణలోని సింగరేణి గనుల్లో పనిచేస్తున్నాడని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment