సాక్షి, జూబ్లీహిల్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఛేదించి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించి మీడియా సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు పట్టణానికి చెందిన దోగిపర్తి షణ్ముఖ పవన్ శ్రీనివాస్ (25) గతంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్స్ ఇంజినీర్‌గా పని చేశాడు. తర్వాత షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. అప్పుల పాలైన శ్రీనివాస్ ఫేస్‌బుక్ ద్వారా కొందరు వ్యక్తులతో పరిచయం చేసుకొని 2013లో శ్రీలంకలోని కొలంబోలో ఒక ఆసుపత్రిలో తన కిడ్నీని రూ. 5 లక్షలకు అమ్ముకొని అప్పులు తీర్చాడు. మరింత డబ్బు సంపాదించాలనే దురాశతో తానే కిడ్నీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న శ్రీనివాస్ సదరు రాకెట్‌తో పరిచయం పెంచుకున్నాడు. బాధితులను, కిడ్నీ డోనర్స్‌ను కొలంబో తీసుకెళ్లి ఇప్పటివరకు ఏడుగురికి కిడ్నీ ఆపరేషన్లు చేయించాడు. మరో 23 ముగ్గురిని కిడ్నీ ఇప్పిస్తానని డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఇతని ద్వారా శ్రీలంకలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తి హైదరాబాద్‌లో చనిపోయాడు.
2016లో అరెస్టు...
దీంతో 2016లో శ్రీలంక పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. 15 నెలలు జైలులో ఉండి విడుదలై ఇండియాకు వచ్చి తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. కిడ్నీలు అవసరమైన పేషంట్లకు ఇంటర్‌నెట్ ద్వారా వలవేసేవాడు. వారికి విదేశాల్లో మెరుగైన వైద్యం చేయిస్తానని, కిడ్నీలు దానం చేయిస్తానని నమ్మబలికేవాడు . ఈ క్రమంలో నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చిందిన నాగరాజు (55) రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతడిని భార్య బిజ్జల భారతి బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఇంటర్‌నెట్ సహా ఇతర మార్గాల ద్వారా బాధితుల గురించి తెలుసుకున్న శ్రీనివాస్.. నాగరాజు భార్య భారతికి మాయమాటలు చెప్పి నమ్మించాడు.
నాగరాజుకు టర్కీలో మెరుగైన వైద్యం చేయిస్తానని, కిడ్నీలను ఇచ్చే దాతలను ఏర్పాటు చేయిస్తానని, అందుకు రూ. 34 లక్షల ఖర్చు అవుతుందన్నాడు. భారతి కుటుంబం ముందస్తుగా శ్రీనివాస్‌కు వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ. 24 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. డాలర్లుగా మార్చడంతో పాటు ఇతర ఖర్చుల కోసం రూ. 10 లక్షల నగదుగా ఇవ్వాలని కోరాడు. ఒప్పందం ప్రకారం సృజన్ అనే వ్వక్తి భారతి ఇంటికి వచ్చి నగదు, నాగరాజు, కుటుంబసభ్యుల పాస్‌పోర్ట్‌లను తీసుకెళ్లాడు. టర్కీలోని ఆస్పత్రిలో వైద్యం, విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు, దాతకు, డాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తం తాను చూసుకుంటానని నమ్మబలికాడు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు.
రూ. 30 నుంచి 50 లక్షలకు ఒప్పందం...
దీంతో తాము మోసపోయామని అనుమానం వచ్చిన భారతి గతేడాది జూన్ 14న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంటర్‌నెట్ ద్వారా బాధితుల గూర్చి తెలుసుకునే శ్రీనివాస్ వారి బలహీతలను సొమ్ము చేసునేవాడు. శ్రీలంకలోని వెస్ట్రన్, నవలోక్, హేమాస్, లంక ఆసుపత్రి సహా టర్కీలోని పలు ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేయిస్తానని, రూ.30 నుంచి 50లక్షలకు ఒప్పందం చేసుకునేవాడు. ఇందులో కేవలం రూ.5 లక్షలలోపు మాత్రమే దాతకు, డాక్టర్లకు, ఏజెంట్లకు పంచి మిగతాది కాజేసేవాడు. భారతి కుటుంబం నుంచి తీసుకున్న సొమ్ము మొత్తం శ్రీలంకలోని కాసినోల్లో ఖర్చుచేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. ఇతడిపై విజయవాడలో ఇప్పటికే రెండు కేసులు, నగరంలోని సీసీఎస్‌లో మరో కేసు ఉన్నాయి. బాధితుల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్.రావు, ఇన్‌స్పెక్టర్ కళింగరావు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌లను డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment