పెచ్చరిల్లిన మూఢజాడ్యం..! | Because of Superstitions.. | Sakshi
Sakshi News home page

పెచ్చరిల్లిన మూఢజాడ్యం..!

Published Wed, Feb 28 2018 10:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Because of Superstitions.. - Sakshi

ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, హత్యోందం వివరిస్తున్న రామలింగయ్య

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా పచ్చని పల్లెల్లో మూఢజాడ్యం పెచ్చరిల్లుతూనే ఉంది. పోలీసులు కళాజాతా బృందాలతో అవగాహన కల్పిస్తున్నా.. పల్లెవాసుల్లో మార్పుకానరావడం లేదు. అందుకు నిదర్శనమే గుర్రంపోడు మండలం తెరాటిగూడెంలో మంగళవారం పట్టపగలే గ్రామ నడిబొడ్డున వృద్ధుడి దారుణ హత్య. మంత్రాల చేస్తున్నాడనే నెపంతోనే గ్రామానికి చెందిన కొందరు కర్రలతో కొట్టి.. బండరాళ్లతో మోది ఈ ఘాతుకానికి ఒడిగట్టడం విస్మయానికి గురి చేస్తోంది.  ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 


గుర్రంపోడు (నాగార్జునసాగర్‌) : మండలంలోని చేపూరు గ్రామ పంచాయతీ పరిధి తెరాటిగూడేనికి చెందిన కన్నెబోయిన రాములు(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారందరికీ వివాహాలు జరిపించాడు. పెద్దకుమారుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా చిన్నకుమారుడు రామలింగయ్య తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ గ్రామంలోనే ఉంటున్నాడు.

ఏడాది క్రితం..
గ్రామానికి చెందిన పిల్లి సాయన్న భార్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, కుమారుడు ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు చేతబడి కారణంగానే వారు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యుల్లో అనుమానం నాటుకుంది. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా కూడా వారి అనుమానాలు రెట్టింపయ్యాయే కానీ తగ్గలేదు. 

కట్టెలతో కొట్టి.. బండరాళ్లతో మోది..
కుమారుడిపై జరిగిన దాడితో తల్లిదండ్రి రాములు, పెద్దమ్మ లబోదిబోమన్నారు. తమకు ఏ సంబంధం లేదని పంచాయితీలో చెప్పినా దాడిచేస్తారా అంటూ కుమారుడిని వెంటబెట్టుకుని దాడిచేసిన ఘటనాస్థలికి బయలుదేరారు. అప్పటికే అక్కడ ఉన్న పిల్లి సాయన్న, కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్యతో పాటు పిల్లి వెంకటయ్య, కన్నెబోయిన సత్తయ్య, మండలి వెంకటయ్యలు కలిసి రాములుపై దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన కుమారుడిని భార్యను పక్కకు తోసేసి గొడ్డలి, కట్టెలతో కొట్టి బండరాళ్లతో మోది రాములును అంతమొందించారు. 

గ్రామంలో పోలీస్‌ పహారా
హత్య సమాచారం అందుకున్న మల్లేపల్లి సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ క్రాంతికుమార్, పరిసర ఎస్‌ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్ట నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ నుంచి పోలీసు బలగాలను రప్పించి గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. 

రెండు దశాబ్దాల్లో ఎనిమిది హత్యలు
మండలంలోని మూరుమూల గ్రామమైన తెరాటిగూడెంలో గత రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది హత్యలు జరిగాయి. తెరాటిగూడెం మండలంలో సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డుల్లో నమోదైంది. రెండు హత్యలు చేతబడి నెపంతో చోటుచేసుకోగా మూడు హత్యలు రాజకీయ పరమైనవి. మరో రెండు కుటుంబ తగాదాల నేపథ్యంలో చోటు చేసుకున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య ఏడాది కాలంగా మిస్టరీగా ఉండి ఇటీవలే వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చేతబడి నెపంతో మండలంలో గతంలో తానేదార్‌పల్లి, తేనపల్లి గ్రామాల్లో సజీవదహనాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. మంత్రాల నెపంతో జరిగిన హత్యలు అన్నీ పట్టపగలే జరుగుతున్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది.

తొలుత కుమారుడిపై దాడి
రాములు కుమారుడు రామలింగయ్య ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా గ్రామానికి చెందిన  పిల్లి సాయన్న,కన్నెబోయిన శ్రీను, కన్నెబోయిన వెంకటయ్యలు అడ్డుకున్నారు. నీ తండ్రి మంత్రాలు చేయడం కారణంగానే తమ ఇంట్లో మరణాలు సంభవించాయని సాయన్న గొడవకు దిగాడు. అంతడితో ఆగకుండా ముగ్గురు కలిసి రామలింగయ్యపై దాడిచేసి కత్తితో పొడవడంతో చేతికి గాయమైంది. రామలింగయ్య వారినుంచి తప్పించుకుని ఇంటికి పరుగెత్తుకొచ్చి తల్లిదండ్రికి జరిగిన విషయం వివరించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement