ఆ రాత్రి ఏం జరిగింది? వీడుతున్న వంటమాస్టర్‌ హత్య కేసు మిస్టరీ | Cook Mysterious Assassination Case Solved Nalgonda Police | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి ఏం జరిగింది? వీడుతున్న వంటమాస్టర్‌ హత్య కేసు మిస్టరీ

Published Thu, Mar 17 2022 11:39 AM | Last Updated on Fri, Mar 18 2022 6:28 AM

Cook Mysterious Assassination Case Solved Nalgonda Police - Sakshi

సాక్షి,మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న వంట మాస్టర్‌ హత్య కేసు చిక్కుముడి వీడుతున్నట్లు తెలిసింది. దామరచర్లకు చెందిన కుర్ర లింగరాజు(38) ఈ నెల 12వ తేదీన రాత్రి మండల కేంద్రంలోని రైల్వే పట్టాల పక్కన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు.. దామరచర్లకు చెందిన లింగరాజుకు అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరితో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. లింగరాజు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలోవంట మనిషిగా పనిచేస్తున్నాడు.

కాగా, లింగరాజు మద్యానికి బానిసగా మారి అనుమానంతో మల్లీశ్వరిని వేధిస్తున్నాడు. అతడి ప్రవర్తనతో విసుగుచెందిన మల్లీశ్వరి, తన సోదరుడు వెంకటేశ్‌ కలిసి లింగరాజును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. లింగరాజు అడ్డుతొలగితే వచ్చే ఆస్తి, ఉద్యోగంతో సుఖంగా జీవించాలన్న ఉద్దేశంతో అతడి భార్య మల్లీశ్వరి, ఆమె సోదరుడు వెంకటేశ్‌ పథకం ప్రకారమే మరో ఇద్దరి సహకారంతో ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. 

ఆ.. రాత్రి ఏం జరిగింది?
లింగరాజు రోజూ మాదిరిగానే 12వ తేదీ రాత్రి 8గంటల ప్రాంతంలో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంట వండి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న లింగరాజు ఇంటికి వచ్చాక భార్య మల్లీశ్వరితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య డబ్బులు, కుటుంబ వ్యవహారాలపై తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం లింగరాజు 9గంటల ప్రాంతంలో మళ్లీ మద్యం తాగేందుకు బయటికి వెళ్లినట్లు తెలిసింది. 

ఆత్మహత్యగా చిత్రీకరించాలని..
అయితే, ఇదే క్రమంలో లింగరాజు భార్య మల్లీశ్వరి ఇంట్లో జరిగిన గొడవ గురించి సోదరుడు వెంకటేశ్‌కు ఫోన్‌ చేసి వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి లింగరాజును హత్య చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి సోదరుడు వెంకటేశ్‌ మరో ఇద్దరితో కలిసి లింగరాజు వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తదనంతరం ఇంటి సమీపంలోనే రైల్వేట్రాక్‌ పక్కన మల్లీశ్వరి, లింగరాజు, వెంకటేశ్, వెంట వచ్చిన రాజ గట్టుకు చెందిన డ్రైవర్, హాస్టల్‌లో పనిచేసే మరో వ్యక్తి సమావేశమయ్యారు.అక్కడే మద్యం తాగుతూ గొడవలు పడితే పరువు పోతుందని లింగరాజుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

అప్పటికే హత్య చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్‌ ఈ క్రజుమంలోనే తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో లింగరాజు గొంతు కోసినట్లు తెలుస్తోంది. తదనంతరం అతడి మృతదేహాన్ని రైలు పట్టాలపై వేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని పథకం కూడా రచించినట్లు తెలుస్తోంది. అయితే, అర్ధరాత్రి దాటిన ఆ సమయ ంలో సమీప కాలనీవాసులు, ఇసుక ట్రాక్టర్లు తిరుగాడుతుండడంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలిసింది. 

పోలీసు జాగిలం అక్కడి వరకే వెళ్లి..
హత్యోదంతం వెలుగుచూడడంతో పోలీసులు జాగిలాన్ని రప్పించారు. మృతదేహం పడి ఉన్న కొద్ది దూరంలో ఉన్న నల్లా వద్దకు వెళ్లి జాగిలం ఆగిపోయింది. అక్కడే రెండు మద్యం బాటిళ్లు కూడా పోలీసులకు లభ్యమయ్యాయి. మద్యం తాపిన తర్వాతే లింగరాజును హత్య చేసి ఉంటా రని, అందుకు ఉపయోగించిన  పదునైన ఆయుధాన్ని అక్కడే నల్లా వద్ద శుభ్రం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

లోతుగా పోలీసుల విచారణ
లింగరాజును అతడి భార్య, బావమరిదే హత్య చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగానే పోలీ సులు లింగరాజు భార్య మల్లీశ్వరి, ఆమె సోదరుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు హత్యోదంతానికి సహకారం అందించిన రాజగట్టుకు చెందిన డ్రైవర్, హాస్టల్‌లో పనిచేసే మరో వ్యక్తి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 అయితే, లింగరాజును హత్య చేయడానికి గల బలమైన కారణాలు ఏమిటి..? హత్యోదంతంలో సూత్రధారులు వెంకటేశ్, మల్లీశ్వరినేనా ? అతడి వెంట వెళ్లిన మరో ఇద్దరు కూడా పాత్రధారులేనా..? ఈ మొత్తం వ్యవహారంలో లింగరాజు భార్య మల్లీశ్వరి పాత్ర ఎంత మేరకు ఉంది.? ఇలా పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు ఒకటి రెండు రోజుల్లో హత్యోదంతం కేసు చిక్కుముడిని విప్పి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement