భానుకిరణ్‌కు యావజ్జీవం  | Bhanu Kiran Was Sentenced To Jail Lifelong | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 19 2018 1:15 AM | Last Updated on Wed, Dec 19 2018 12:59 PM

Bhanu Kiran Was Sentenced To Jail Lifelong - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/చంచల్‌గూడ: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు మలిశెట్టి భానుకిరణ్‌ అలియాస్‌ భానును న్యాయస్థానం దోషిగా తేల్చింది. భానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భాను ప్రైవేటు గన్‌మన్‌ మన్మోహన్‌సింగ్‌ బదౌరియాను సైతం దోషిగా తేల్చిన కోర్టు... అతనికి ఐదేళ్ల జైలు విధించింది. వారితోపాటు నిందితులుగా ఉన్న మరో నలుగురిని నిర్ధోషులుగా తేల్చింది. భానుకిరణ్‌కు ఐపీసీ సెక్షన్‌ 307 కింద యావజ్జీవ కారాగారంతోపాటు రూ. 20 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నిషేధిత ఆయుధాలను ఉపయోగించినందుకు ఆయుధ చట్టంలోని సెక్షన్‌ 27 (2) కింద పదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది.

సూరి హత్య విషయం గురిం చి రహస్యంగా ఉంచినందుకు భాను గన్‌మన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం... అతనికి ఐపీసీ సెక్షన్‌ 212 కింద ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకు ఐపీసీ సెక్షన్‌ 201 కింద మరో ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ మేరకు నాంపల్లి మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి కుంచాల సునీత మంగళవారం తీర్పునిచ్చారు. దోషులు ఏకకాలంలో శిక్షలను అనుభవించాలని ఆమె తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న కాలాన్ని మినహాయించాలన్నారు. నిందితులుగా ఉన్న శూలం సుబ్బయ్య, బోయ వెంకట హరిబాబు, ఆవుల వెంకటరమణ, కటిక వంశీధర్‌రెడ్డిలను నిర్ధోషులుగా తేల్చిన న్యాయమూర్తి... వారిపై అభియోగాలను సీఐడీ రుజువు చేయలేకపోయింద న్నారు. దోషులు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చన్నారు. గత ఆరున్నరేళ్లుగా భానుకిరణ్‌ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉండగా మన్మోహన్‌ ఎనిమిదేళ్లుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. 

2011లో హత్య.. 2012లో అరెస్ట్‌... 
మద్దెలచెర్వు సూరి 2011 జనవరి 3న సాయంత్రం తన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్‌ చేతిలో హత్య కు గురయ్యారు. సూరితోపాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్‌ యూసఫ్‌గూడ ప్రాంతానికి రాగా నే తనవద్ద ఉన్న 0.32 ఎంఎం తుపాకీతో సూరిని కాల్చి చంపి పరారయ్యాడు. ఈ హత్యపై తొలుత బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేయగా ఆ తరువాత కేసు సీసీఎస్‌కు అక్కడి నుంచి సీఐడీకి బదిలీ అయింది. దర్యాప్తు అనంతరం సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. భాను పరారీలో కావటంతో అతన్ని పక్కనపెట్టి మిగిలిన వారిపై చార్జిïషీట్‌ దాఖలు చేశారు. సీఐడీ అధికారులు 2012 ఏప్రిల్‌ 21న జహీరాబాద్‌ వద్ద భానుకిరణ్‌ను అరెస్టు చేసి మరో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో సీఐడీ 150 మందిని సాకు‡్ష్యలుగా పేర్కొనగా విచారణలో 92 మందినే విచారించారు. 56 మంది సాక్ష్యాలను కోర్టు ముందుంచారు. సూరి అనుచరుడిగా భా ను అన్ని ఆర్థిక లావాదేవీలను చూసే వాడని, సూరి తో భానుకున్న అంతర్గత శతృత్వం, ఇతర నిందితులతో భానుకున్న సాన్నిహిత్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ వాదనతో ఏకీభవిస్తున్నట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. 

తప్పుడు కేసు బనాయించారు: భానుకిరణ్‌ 
శిక్షల ఖరారు ముందు న్యాయస్థానం భానుకిరణ్, మన్మోహన్‌లను ఏదైనా ఉంటే చెప్పుకోవాలని సూచించింది. దీనికి భానుకిరణ్‌ స్పందిస్తూ తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. తనకు శిక్ష విధించే ముందు సానుభూతితో తన కేసును పరిశీలించాలని కోరారు. మన్మోహన్‌సింగ్‌ కూడా ఇదే మాట చెప్పాడు. అయితే తీర్పు వెలువడేటప్పటికే మన్మోహన్‌ శిక్షాకాలం పూర్తి కావడంతో రాత్రి 8 గంటలకు అతన్ని చంచల్‌గూడ జైలు నుంచి విడుదల చేశారు. కోర్టు తీర్పుతో భానుకిరణ్‌ కలత చెందినట్లు తెలుస్తోంది. 


దోషులు.. నిందితులు.. అభియోగాలు 

ఏ1 భానుకిరణ్‌                       : ఐపీసీ సెక్షన్లు 302, 120బి, 302 రెడ్‌విత్‌ 34, 304 రెడ్‌విత్‌ 109, 212, 201, ఆయుధ చట్టం సెక్షన్‌ 27(2) 
ఏ2 మన్మోహన్‌సింగ్‌                : ఐపీసీ సెక్షన్లు 120బి, 109 
ఏ3 శూలం సుబ్బయ్య            : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, ఆయుధాల చట్టం సెక్షన్‌ 25(1బీ) 
ఏ4 బోయ వెంకట హరిబాబు    : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, 212 
ఏ5 ఆవుల వెంకటరమణ        : ఐపీసీ సెక్షన్లు 120ఎ, 34, 109, 212, 
ఏ6 కటిక వంశీధర్‌రెడ్డి            : 120ఎ, 34, 109, 212 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement