అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి
విద్యార్థినులకు లైంగిక వేధింపుల ప్రేరణ వ్యవహారం ఉచ్చులో తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ను ఇరికించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయని తెలిసింది ఆయన మీద అనుమానాలు వ్యక్తంచేస్తూ, రీకాల్‌కు పట్టుబడుతున్నాయి. ఈగవర్నర్‌ను వెనక్కు తీసుకోండనే నినాదం ఆదివారం సీపీఎం నేతృత్వంలో తెరమీదకు వచ్చింది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆ పార్టీ లేఖాస్త్రం సంధించింది. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ నిర్మలా దేవి ఇంట్లో సాగిన తనిఖీల్లో లభించిన డైరీలో పలువురు పెద్దల గుట్టు ఉన్నట్టు సమాచారం. ఇందుకు బలం చేకూర్చే రీతిలో సీబీసీఐడీ పలువురిని విచారణ వలయంలోకి తీసుకు రావడం గమనార్హం.
సాక్షి, చెన్నై : విద్యార్థినులకు లైంగిక ప్రేరణలో చిక్కిన ప్రొఫెసర్ నిర్మలా దేవిని సీబీసీఐడీ తీవ్రంగానే విచారిస్తోంది. ఆమె గుట్టును రట్టు చేసిన విద్యార్థినులను సైతం సీబీసీఐడీ ప్రత్యేక బృందం రహస్య విచారణ చేపట్టింది. వారి నుంచి సేకరించిన సమాచారంతో నిర్మలా దేవి సోదరుడు రవిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతడితో కలిసి ఈ ప్రత్యేక బృందం శనివారం రాత్రంతా పుదుకోట్టైలోని నిర్మలా దేవి నివాసంలో సోదాలు చేసింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్‌లతో పాటు బ్యాంక్ ఖాతాలు, కొన్ని డైరీలను సీబీసీఐడీ స్వాధీనం చేసుకుంది. ఆదివారం ఉదయాన్నే ఆ ఇంటిని అధికారులు సీజ్ చేశారు.
డైరీలో లభించిన సమాచారం మేరకు నిర్మలా దేవి భర్త శరవణతో పాటు నలుగురు కాంట్రాక్టర్లను విచారించేందుకు నిర్ణయించారు. అదే సమయంలో మదురై కామరాజర్ వర్సిటీకి చెందిన ఓ డైరెక్టర్‌ను గురిపెట్టి, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు సాగాయి. నిర్మలా దేవి డైరీలోని గుట్టు మేరకు ఈ సోదాలు సాగుతుండడంతో, మరెందరు ఈ విచారణ వలయంలోకి వస్తారోఅనే చర్చ బయలు దేరింది. కాగా, సీబీసీఐడీ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో గవర్నర్ బన్వరిలాల్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ఐఏఎస్ సంతానం కమి టీ ఇరకాటంలో పడింది. నిర్మలాదేవి వద్ద విచారణ సా గించడం ఆ కమిటీకి కష్టతరంగా మారినట్టు తెలు స్తోం ది. ఆమె వద్ద విచారణ లక్ష్యంగా సోమవారం ఆ కమిటీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గవర్నర్ రీకాల్‌కు పట్టు
నిర్మలా దేవి బండారం, తెర వెనుక ఉన్న శక్తుల్ని తెర మీదకు తెచ్చే దిశలో విచారణ వేగం ఓ వైపు జోరందుకుంది. మరోవైపు ఈ ఉచ్చులో గవర్నర్ బన్వరిలాల్‌ను సైతం ఇరికించే రీతిలో ప్రతిపక్షాలు ప్రయత్నాల్లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షాలు, తాజా పరిస్థితుల్ని అస్త్రంగా చేసుకుని ఆయన రీకాల్‌కు పట్టుబట్టే పనిలో పడ్డాయి. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖాస్త్రం సంధించారు. అందులో విద్యార్థినులకు లైంగిక ప్రేరణ, నిర్మలా దేవి వ్యవహారాన్ని గుర్తుచేస్తూ, ఇందులో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో గవర్నర్ దూకుడుగా ముందుకు సాగడం అనుమానాలకు బలాన్ని ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ఆయనకు లేదని వివరిస్తూ, ఆగమేఘాలపై గవర్నర్ స్పందించిన విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం వెనుక కారణాలు ఏమిటో సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గవర్నర్ మీద సైతం ఆరోపణలు ఉన్నాయని, అలాంటప్పుడు ఆయన నియమించిన కమిటీ ఎలా విచారణను న్యాయబద్ధంగా నిర్వహించగలదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీ విచారించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ దృష్ట్యా, గవర్నర్‌ను వెనక్కు పిలిపించుకోవాలని, ఆయన మీద విచారణకు ఆదేశించాలని పట్టుబట్టారు. లేని పక్షంలో తమిళనాట ఆందోళనలు మరింతగా భగ్గుమంటాయని పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment