
కుక్కలకు ఆహారమైన నవజాత శిశువు జేఎన్‌టీయూ సమీపంలో పడేసిన శిశువు బిడ్డను పారేస్తూ పట్టుబడిన వ్యక్తులు
అనంతపురం కల్చరల్: పురిటి బిడ్డను కాలవ పాలు చేసిన ఘటన మరువక ముందే అనంతలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు నవజాత శిశువులు కుక్కలకు ఆహారంగా మారారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని విద్యుత్ నగర్ నుంచి శారదానగర్‌ను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న 80 అడుగుల రోడ్డు పక్కనే సోమవారం మధ్యాహ్నం ముళ్ల కంపల్లో ఓ నవజాత శిశువును అట్టపెట్టిలో పెట్టి పారిపోయారు.
ఎవరూ గమనించకపోవడంతో వీధి కుక్కలు ఆ శిశువు శరీరంలోని చాలా భాగాలను తినేశాయి. కాగా, అట్టపెట్టెలో శిశువును పడేసి వెళుతున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరు సర్వజనాస్పత్రిలో పనిచేస్తున్న శివ, మరొకరు కరిముల్లా అని తేలింది. విచారణలో తమకు సెక్యూరిటీ ఆఫీసర్ జోషి రూ. 500 ఇచ్చి నవజాత శిశువును ఖననం చేయాలని సూచించినట్లు నిందితులు తెలిపారు. మరో ఘటనలో జేఎన్టీయూ సమీపంలో ఓ పసికందును పడేసి వెళ్లారు. సోమవారం ఉదయమే రెండు ఆటోల్లో వచ్చిన అమ్మాయిలు ఇందుకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, అధికారుల సూచన మేరకు మృతశిశువుల మృతదేహాలను సాయి సంస్థ అధ్యక్షుడు విజయసాయికుమార్ ఖననం చేశారు.