
జైపూర్ : రాజస్తాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ లాల్ సైని (75) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. మదన్ లాల్ సైని రాజ్యసభ సభ్యుడే కాక గత సంవత్సరంలో రాజస్తాన్ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మదన్ లాల్ సైని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. మదన్ లాల్ మరణం పట్ల రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లొట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాజ్యసభ నాయకుడు మదన్ లాల్ మరణించారన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. మదన్ లాల్ సైని సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు.