తాతయ్య ఒడిలో జ్యోతి, కృష్ణానదిలో మునిగిపోయిన పడవ
అమ్మా లేమ్మా.. నాన్నా.. చెల్లిని, అమ్మను పైకి లేవమని చెప్పు.. తాతయ్యా.. చెల్లి నాతో ఆడుకోవడానికి రావడం లేదు.. నువ్వయినా పిలువు.. మామయ్య వాళ్ల ఇంటికి వెళదాం.. అంటూ ఆ చిట్టి తల్లి మారం చేస్తుంటే.. ప్రతి గుండె కన్నీటితో ద్రవించింది. చిన్నారి ఎదురుగా పడి ఉన్న తల్లి, చెల్లి.. ఇక రారని చెప్పడానికి గొంతు పెగలక కృష్ణమ్మ మౌనంగా కదిలిపోయింది. తననే నమ్ముకున్న జీవితాలు తన ఒడిలోనే తెల్లారిపోతుంటే.. గుండె పగిలేలా రోదించింది. శనివారం తుళ్లూరు మండలంలో బోరుపాలెం వద్ద పడవ ప్రమాదంలో తల్లీకూతురు మృత్యువాత పడ్డారు.
కృష్ణమ్మ ఒడిలో మృత్యుకేక వినిపించింది. నదినే నమ్ముకున్న వారి జీవితం నీటిలో మునిగిపోయింది. పొట్టకూటి కోసం వేటకొచ్చి నదిలో వలవేస్తే మృత్యువు అందులోకి లాగేసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నడకుదిటి సైదారాజుకు భార్య మాధవి(26), చిన్నకూతరు కావ్య(3)తో కలసి రాయపూడి ఇసుక రీచ్‌ను ఆనుకుని ఉన్న లంక రేవు వద్ద వేటకు వచ్చాడు. చీకటి పడటంతో ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో ఇసుకను తరలిస్తున్న పడవ వేగంగా వచ్చి వీరు నిద్రిస్తున్న తెప్పను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ నదిలో పడిపోయారు. భార్య, బిడ్డ నీటిలో మునిగిపోయారు. గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.
తుళ్ళూరు రూరల్ : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నడకుదిటి సైదారాజుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు. వేసవి సెలవులు కావడంతో పెద్ద కూతురు జ్యోతిని అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద వదిలి పెట్టాడు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు బోరుపాలెం సమీపంలో రాయపూడి ఇసుక రీచ్‌ను ఆనుకుని ఉన్న లంక రేవు వద్దకు వేటకని బయలుదేరాడు. చిన్న కూతురు కావ్యను పక్కింట్లో వదిలి వెళదామని భార్యాభర్తలు సైదారావు, మాధవి అనుకున్నారు. కావ్య తానూ వస్తానని మారం చేయడం, పిల్లలను పట్టుకెళుతున్నారనే వందతులు రావడంతో తమ వెంట తీసుకెళ్లారు. నదిలో వలవేసి పడవలోనే కాపలా కాస్తుండగా తెల్లవారుజాము కావడంతో ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో రాయపూడి రేవు నుంచి ఇసుక నింపుకునేందుకు నదిలోకి పడవ అటుగా వచ్చింది. పడవ నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా వీరు నిద్రిస్తున్న తెప్పను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ నదిలో పడిపోయారు. కావ్య(3), మా«ధవి(26) నీటిలో మునిగిపోయారు. సైదారావు నీటిలో భార్య, బిడ్డ కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పడవలోని ఈతగాళ్లు సైదారావును ఒడ్డుకు చేర్చారు.
పోలీసుల అదుపులోపడవ నిర్వాహకుడు
పడవ నిర్వాహకుడు నాగమల్లేశ్వరరావును ఫిషర్‌మ్యాన్ రాయపూడి సొసైటీ వారు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సుధాకరరావు, ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి నాలుగు పడవల ద్వారా నదిలోకి వెళ్లారు. గజ ఈతగాళ్ల సాయంతో తొలుత కావ్య, కొద్దిసేపటికి మాధవి మృతదేహాలను గుర్తించగలిగారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రెడ్డి రీచ్‌ను పరిశీలించారు. సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
జ్యోతికి అండగా ఉంటాం
చిన్నారి జ్యోతి పేరు మీద కొంత ఆర్థిక సాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామని రాయపూడి సొసైటీ సభ్యులు చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నేత కత్తెర సురేష్‌కుమార్, సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, సీఐటీయూ రాజధాని ప్రాంత డివిజన్ కార్యదర్శి జొన్నకూటి నవీన్‌ప్రకాష్ డిమాండ్ చేశారు.
రూ.11 లక్షల ఆర్థిక సహాయం
విజయవాడ : కృష్ణా నదిలో ప్రమాదవశాత్తూ పడవ మునిగి చనిపోయిన ఇబ్రహీంపట్నానికి చెందిన తళ్లీకూతుళ్లు మాధవి, కావ్యల కుటుంబానికి రూ.11 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి కారణమైన బోటు యాజమాన్యం రూ.6 లక్షలు అందజేస్తోందని, చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు మృతురాలు మాధవి భర్త సైదురాజుకు ఇస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment