సాక్షి, వరదయ్యపాళెం(చిత్తూరు) : బతుకు తెరువు కోసం రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిన వలస కూలీ ఇంట సుడిగాలి విషాదాన్ని నింపింది. శనివారం సుడిగాలి బీభత్సానికి సత్యవేడు మండలం పాలగుంట సమీపంలోని కాప్రికార్న్ జ్యూస్ పరిశ్రమ వద్ద వలస కూలీలు నివాసమున్న రేకుల షెడ్డు కుప్పకూలింది. అందులో ఉన్న 7 ఏళ్ల చిన్నారి అక్కడి కక్కడే మృతి చెందగా మరో 9 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడేయం జిల్లా, సానఫర్ గ్రామానికి చెందిన 300 మంది వలస కూలీలు కాప్రికార్న్ పరిశ్రమలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు.
వీరికి పరిశ్రమ సమీపంలో నివాసం ఉండడానికి తాత్కాలిక రేకుల షెడ్డులను ఏర్పాటు చేశారు. అయితే కూలీలు మాత్రం రోజు లాగానే పరిశ్రమలోనికి పనులకు వెళ్లగా వారి పిల్లలు తాత్కాలిక రేకుల షెడ్డుల వద్ద ఉండగా, ఒక్కసారిగా వచ్చిన సుడిగాలికి రేకుల షెడ్డు కుప్పకూలింది. అందులో ఉన్న ఇరిఫన్ కుమార్తె నిషా (7) తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. అభిషేక్ ఖాన్ (5), సోల్ ఖాన్ (3), ఆకాష్ (16), అస్లాం (11), యాష్మీ (10), దీపక్ చౌదరి (36), సహానా (11), సతీష్ (27), జుపేదా (8) గాయపడ్డారు. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందించారు. గాయపడిన వారందరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మల్లికార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం..బాధాకరం: ఎమ్మెల్యే ఆదిమూలం
కాప్రికార్న్ జ్యూస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం బాధాకరమని స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం విచారం వ్యక్తం చేశారు. వలస కూలీలల కుటుంబ సభ్యులు 9 మంది గాయపడడం, మరో చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సత్యవేడు ప్రభుత్వాస్పత్రి వైద్యులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment