ప్రియురాలు లేదని ప్రియుడి ఆత్మహత్య | The boy friend committed suicide at yousufguda | Sakshi
Sakshi News home page

ప్రియురాలు లేదని ప్రియుడి ఆత్మహత్య

Published Sat, Dec 16 2017 4:59 AM | Last Updated on Sat, Dec 16 2017 4:59 AM

The boy friend committed suicide at yousufguda - Sakshi

షాద్‌నగర్‌: నెల రోజుల క్రితం ప్రియురాలు ఉరివేసుకొని మృతి చెందగా మనస్తాపం తో ప్రియుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని విజయనగర్‌ కాలనీకి చెందిన భావన, ఈశ్వర్‌ కాలనీకి చెందిన గిరీశ్‌గౌడ్‌ ప్రేమించుకున్నారు. భావనకు వారి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థం జరిపించారు. దీనికి మనస్తాపం చెందిన ఆమె నెల క్రితం ఉరి వేసుకొని మృతి చెందింది. ఆమె మృతికి గిరీశ్‌గౌడ్‌ కారణమంటూ భావన బంధువులు అతనితో పాటు అతని బంధువులపై వేధింపుల కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో గిరీశ్‌గౌడ్‌ మనస్తాపానికి గురై యూసుఫ్‌గూడలో సూసైడ్‌ నోట్‌ రాసి శుక్రవారం ఉరి వేసుకున్నాడు.  

 బాలికకు బలవంతపు పెళ్లి  
భర్త చెర నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు

అనంతగిరి (వికారాబాద్‌): బలవంతపు పెళ్లిపై ఓ బాలిక పోరాటం చేసింది. తనకు చదువుకోవాలని ఉందని చెప్పినా వినకుండా పెళ్లి చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. పెళ్లి తర్వాత మూడు రోజుల అనంతరం వారి చెర నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలో రాత్రంతా ఓ అడవిలో గడిపింది. ఎట్టకేలకు తెల్లవారుజామున పోలీసులు, చైల్డ్‌లైన్‌ 1098ను సంప్రదించింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. మర్పల్లి మండలానికి చెందిన ఓ బాలిక (17)కు తండ్రి లేడు. తల్లిపై బంధువులు ఒత్తిడి చేసి కర్ణాటకలోని చించోలికి చెందిన 40 ఏళ్ల వ్యక్తితో ఈ నెల 11న వివాహం చేశారు. 

అయితే అతడికి ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారు. వివాహమయ్యాక ఈ నెల 13న సంగెంలో బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బాలిక ఎవరికీ తెలియకుండా సెల్‌ఫోన్‌ తీసుకుని గ్రామం నుంచి బయటపడి, ఓ బస్సు పట్టుకుని కల్లూర్‌లో దిగింది. అప్పటికే చీకటవడంతో బంధువులు వస్తారనే భయంతో రాత్రంతా గ్రామ సమీపంలోని అడవిలో గడిపింది. తెల్లవారుజామున చైల్డ్‌లైన్‌ 1098కి కాల్‌ చేయగా.. వారు ఆ అమ్మాయిని అక్కున చేర్చుకున్నారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు పరిగిలోని చైల్డ్‌ హోంకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement