
మెండు భార్గవ్ (ఫైల్), నీటి తొట్టిలో పడి మృతిచెందిన భార్గవ్
శాయంపేట(భూపాలపల్లి): ఆటలాడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న నీటితొట్టిలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండలకేంద్రంలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన మెండు రామకృష్ణ, రాజేశ్వరిలకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దకుమారుడు మెండు భార్గవ్(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భార్గవ్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రదేశాలను, వివాహాల వద్ద వెతికారు. వాట్సప్‌లో భార్గవ్ ఫొటోతో కనిపించడంలేదంటూ సమాచారాన్ని చేరవేసారు. రాత్రంతా బంధువులు, తెలిసిన చోటల్లా వెతికినప్పటికీ ఎక్కడా కూడా కనిపించలేదు.
శుక్రవారం ఉదయాన్ని ఇంటి సమీపంలోని ఓ సంఘం బిల్డింగ్ సమీపంలో ఉన్న నీటితొట్టిలో పడి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాలుడు తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని భార్గవ్ మృతదేహాన్ని చూసి చేసిన రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. గతంలో ఇదే నీటితొట్టిలో లేగదూడ పడి మృత్యువాత పడినప్పటికీ సంబంధిత సంఘం సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ అదే తొట్టిలో బాలుడు పడి మృతిచెందడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment