సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో నగదు అక్రమ తరలింపు మొదలైంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు డబ్బు అక్రమంగా తరలుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి రసీదులూ లేకుండా తరలిస్తున్న రూ.10 కోట్ల నగదును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్నడస్టర్ వాహనం (కెఏ46 ఎం 6095) డిక్కీలో బెంగళూర్‌కు చెందిన వినోద్‌శెట్టి, శబరీష్ ఈ మొత్తాన్ని తరలిస్తుండగా జైనథ్ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. నాగ్‌పూర్ జిల్లా జామ్ నుంచి హైదరాబాద్‌కు ఈ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు నిందితులు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పట్టుకున్న ఇద్దరిని పోలీసుల విచారిస్తున్నారు.
గన్నీ సంచుల్లో నోట్ల కట్టలు..
తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంటున్న తరుణంలో ఒకేసారి రూ.10 కోట్లను తరలిస్తూ పోలీసులకు చిక్కడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల కోసమే ఈ మొత్తాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం నుంచి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. లావాదేవీలకు సంబంధించి సరైన వివరాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించడాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులో పిప్పర్‌వాడ వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేసి శుక్రవారం తనిఖీలు చేస్తున్నారు. జైనథ్ ఈవోపీఆర్డీ సంజీవ్‌రావు, ఏఎస్సై జీవన్ వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న డస్టర్ వాహన డిక్కీని తెరిచారు. ఐదు తెల్లటి గన్నీ సంచులు ఉండటంతో అనుమానించి వాటిని విప్పి చూశారు. రూ.500, రూ.2వేల నోట్ల కట్టలు క్రమపద్ధతిలో పేర్చి ఉన్నాయి.ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, జైనథ్ సర్కిల్ సీఐ స్వామి, ఎస్సై తిరుపతి హుటహుటిన చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. నగదును తరలిస్తున్న వినోద్‌శెట్టి, శబరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.10 కోట్ల మొత్తాన్ని లెక్కించి రశీదులు అడుగ గా, నిందితులు ముఖాలు తేలేశారు. వాహనంతోపాటు నగదును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ వాహనం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు నిర్ధారించారు. ఆ నగదు ఎవరిది, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో, ఎందుకోసమో తెలియాల్సి ఉంది. శనివారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎవరి కోసం ఈ సొమ్ము..?
దసరా ఉత్సవాలు తెలంగాణలో ఘనంగా జరుగుతాయి కాబట్టి, పోలీసు యంత్రాంగం కూడా పండుగ హడావుడి నుంచి బయటికి రారనే ఆలోచనతో భారీ మొత్తంలో నగదును తరలించే ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్ జిల్లా జామ్ నుంచి కారులో వస్తున్నట్లు నిందితులు చెబుతుండటం గమనార్హం. శనివారం తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పర్యటన ఉంది. భైంసా, కామారెడ్డిలో ఆయన బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుపడటం చర్చనీయాంశం అయింది. అలాగే నాగ్‌పూర్ ఎంపీగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. దీంతో పోలీసులు రాజకీయంగా ఈ కోణాల్లో విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం పోలీసులు అధికారికంగా మీడియాకు వివరాలు అందించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment