పోలీసుల అదుపులో పేకాట రాయుళ్లు
సాక్షి,సిటీబ్యూరో: ఓ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడైన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌తో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. గుల్బర్గాకు చెందిన అబ్దుల్ ఖదీర్ నాలుగేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. నెలకు రూ.6,500 జీతానికి చిరాగ్ అలీ లైన్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ జీతంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు.
ఈ నేపథ్యంలో కొన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో మూడు నెలలుగా తనకు పరిచయస్తులైన పేకాట రాయుళ్ళతో పాటు వారి స్నేహితులను రప్పించి అర్ధరాత్రి వేళల్లో వారితో మూడు ముక్కలాటలు ఆడించి కమీషన్లు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురిని రప్పించిన ఖదీర్ వారితో పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాస్‌రావు నేతృత్వంలోని బృందం దాడి చేసింది. నిర్వాహకుడు ఖదీర్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.32,640 నగదు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment