కోడెల కుమార్తెపై కేసు | Case Against Kodela Siva Prasada Rao Daughter Vijayalakshmi | Sakshi
Sakshi News home page

కోడెల కుమార్తెపై కేసు

Published Sun, Jun 9 2019 8:14 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Case Against Kodela Siva Prasada Rao Daughter Vijayalakshmi - Sakshi

నరసరావుపేట టౌన్‌:  మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం సాగించిన అరాచక పర్వం మరొకటి వెలుగు చూసింది. సోదరుడిని మించిన సోదరిగా కోడెల కుమార్తె అవినీతి వ్యవహారం బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమి కబ్జాకు అనుచరులతో కలసి ప్రయత్నం చేశారు. భూ యజమానులను బెదిరించి రూ.15 లక్షల ‘కే’ ట్యాక్స్‌ వసూలు చేశారు. మరో రూ.5 లక్షల కోసం వేధింపులకు దిగడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన అర్వపల్లి పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. ఆ భూమిని 2002లో రావిపాడుకి చెందిన పూదోట మారయ్య వద్ద కొనుగోలు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలువైన ఆస్తులు, అమాయకుల భూములపై కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి కన్నేసి.. లేని వివాదాలను సృష్టించి ‘కే’ ట్యాక్స్‌ వసూలు చేశారు. కేసానుపల్లిలో రోడ్డు వెంట పద్మావతికి ఉన్న విలువైన ఎకరా భూమిపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్నుపడింది. 

చదవండి: (కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు)

రెండేళ్ల కిందట ఆమె ఆంతరంగికుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ముఖ్య అనుచరుడు కళ్యాణం రాంబాబు ఆ పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించారు. ముందుగానే సృష్టించిన నకిలీ పత్రాలను చూపించి ఆ పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కొనుగోలు చేసిందని, మరోమారు భూమి వద్దకు వస్తే హతమారుస్తామని బెదిరించారు. విజయలక్ష్మి వద్దకు వెళ్లి ముడుపులు (కే ట్యాక్స్‌) చెల్లించి వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాలని, లేకుంటే పొలానికి ఫెన్సింగ్‌ వేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు, కుమారుడు గోళ్లపాడులోని సేఫ్‌ కంపెనీ వద్దకు వెళ్లి విజయలక్ష్మిని కలిశారు. ఆమెను పొలం విడిచి వెళ్లాలని, లేకుంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.15 లక్షలు ఇస్తామని, అవి కూడా విడతల వారీగా కడతామని ఒప్పందం చేసుకున్నారు. 

అనుకున్న ప్రకారం రూ.15 లక్షల్ని 3 విడతలుగా చెల్లించారు. గత ఏడాది జనవరిలో పొలంలో ఉన్న సుబాబుల్‌ తోటను నరికించేందుకు పొలం యజమాని పద్మావతి, ఆమె భర్త వెళ్లగా రాంబాబు, శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మరో రూ.5 లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగు పెట్టనిస్తామని, లేకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన భూ యజమానులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల కిందట పొలం వద్దకు వెళ్లిన పద్మావతి, ఆమె భర్తపై శ్రీనివాసరావు, రాంబాబు మరో ముగ్గురు కలసి దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయలక్ష్మి, ఆమె అనుచరులు కళ్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై షేక్‌ మహ్మద్‌ షఫీ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement