అద్దెకు తిప్పుతూ రవాణాశాఖ అధికారుల తనిఖీలో పట్టుబడిన సొంత వాహనం
నగరంపాలెం: సొంత నెంబరు ప్లేటు కలిగిన వాహనాలను బాడుగకు తిప్పితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ జీసీ రాజరత్నం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని అనేక కార్లు, ఇన్నోవాలు, టవేరాలు, స్కార్పియో తదితర వాహనాలను సొంత నంబరు ప్లేటుతో (వ్యక్తిగత) వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని బాడుగకు తిప్పుతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అలాంటి వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 286 వాహనాలపై కేసులు నమోదుచేసి రూ.3.92 లక్షల అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. జిల్లాలోని అధికారులు తమ సిబ్బంది వ్యక్తిగత వాహనాలను అద్దె వాహనాలుగా వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సొంత వాహనాలను అద్దె వాహనాలుగా తిప్పుతున్నట్టు సమాచారం తెలిస్తే ఆర్‌టీఏ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. తనిఖీలు నిరంతరం జరుగుతుంటాయని తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసీ రాజరత్నం హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment