సాక్షి, హైదరాబాద్: కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం (జూలై 2) నవజాత శిశువు కిడ్నాప్‌కు గురైంది. ఈ కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. సీసీ కెమెరాల సాయంతోనే ఇప్పటివరకు చాలా కేసులను ఛేదించగలిగామని చెప్పారు. అందరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఇదివరకే రెండు సార్లు పిల్లలు పుట్టి చనిపోవడంతో నిందితురాలు తీవ్ర మనోవేదనకు గురైందని పోలీసులు తెలిపారు. మూడోసారి కూడా పిల్లలు కలగకపోతే భర్త వదిలేస్తాడనే భయంతో నయనారాణి ఈ కిడ్నాప్‌కు పాల్పడొచ్చని నిందితురాలి వదిన సునీత చెప్పారు.
కిడ్నాప్ అనంతరం నయన బీదర్‌వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల సాయంతో తెలుసుకున్నామని కమిషనర్ అన్నారు. కర్ణాటక పోలీసుల సాయంతో బీదర్‌లో ప్రతి ఇంటిని తనిఖీ చేశామని వెల్లడించారు. ఈ కేసులో మీడియా సహకారం మరువలేనిదని కొనియాడారు. గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో నిందితురాలు చిన్నారిని బీదర్ ప్రభుత్వాసుపత్రిలో వదిలి వెళ్లిందని తెలిపారు. నయనా, ఆమె భర్త సల్మాన్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసముండేవారని కమిషనర్ తెలిపారు. పిల్లలు పుట్టక పోవడంతోనే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. చిన్నారి కిడ్నాప్ కేసులో ఏసీపీ చేతన చాకచక్యంగా వ్యవహరించారనీ, ఆమె పేరునే పాపకు పెట్టామని తెలిపారు. నయనారాణిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment