నిందితులు బాలరాజు, షాలిని
మల్కాజిగిరి: వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగులను మోసగించిన కేసులో నిర్వాహకురాలితో పాటు మరొకరిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ సంజీవరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..సికింద్రాబాద్ ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన మునుకుల షాలిని గతంలో ఖైరతాబాద్‌లోని వర్క్ ఫర్ హోమ్ సంస్థలో పనిచేసింది. ఈ అనుభవంతో గత జూన్ నెలలో కార్ఖానాలో ఎస్–వర్క్ ఫర్ హోమ్ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులు రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వారికి వెయ్యి నంబర్లు నింపే ఖాళీ గడులున్న షీట్లు వారానికి 90 చొప్పున ఇస్తారు. వాటిని కరెక్టుగా పూరిస్తే ఒక్కో షీట్‌కు రూ. 90 చొప్పున రూ.8వేలు, ఎవరినైనా చేర్పిస్తే అదనంగా రూ.500 చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. గత జులైన నెలలో మల్కాజిగిరి, శివపురి కాలనీలోనూ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. దీంతో పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు దాదాపు వంద మంది డబ్బులు చెల్లించి అందులో చేరారు. షీట్స్ నింపి ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ నెల 3న వారు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాలినితో పాటు మల్కాజిగిరి కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్న రామాంతపూర్‌కు చెందిన బరిగె బాలరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కార్ఖానాలో కూడా ఇలాగే నిరుద్యోగులను మోసగించి అక్కడ కార్యాలయం తీసివేసి మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిందని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment