‘ఖైదీ’ సినిమా తరహా చోరీ  | Cigarettes stolen: Container hijacked In Prakasam district | Sakshi
Sakshi News home page

సిగరెట్ల కంటైనర్‌ హైజాక్‌ 

Published Sun, Jan 26 2020 11:26 AM | Last Updated on Sun, Jan 26 2020 1:47 PM

Cigarettes stolen: Container hijacked In Prakasam district - Sakshi

సాక్షి, గుడ్లూరు: జాతీయ రహదారిపై సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను దుండగులు హైజాక్‌ చేశారు. కంటైనర్‌కు వాహనాలు అడ్డు పెట్టి వాటిల్లో ఉన్న దుండగలు కంటైనర్‌ డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన కాళ్లు, చేతులు కట్టేసి చెడ్లలో పడేసి కంటైనర్‌తో వెళ్లిపోయారు. సినీ పక్కీలో సంచలనం రేపిన ఈ సంఘటన ప్రకాశం జిల్లా 16వ నంబర్‌ జాతీయ రహదారిపై తెట్టు–శాంతినగర్‌ గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడకు సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ శాంతినగర్‌–తెట్టు గ్రామాల మధ్యలోకి వచ్చే సరికి కారులో వచ్చిన దొంగలు కంటైనర్‌కు తమ కారును అడ్డు పెట్టారు. డ్రైవర్‌ రవి కంటైనర్‌ను ఆపేశాడు. 

కంటైనర్‌లోకి ఎక్కిన దుండగులు డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచి బట్టలు విప్పదీసి కాళ్లు, చేతులు గుడ్డ పేలికలతో కట్టేసి కళ్లకు గంతలు చుట్టారు. అనంతరం అతడిని రహదారి పక్కన ఉన్న చెట్లల్లో పడేసి కంటైనర్‌ను అపహరించుకెళ్లారు. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో డ్రైవర్‌ పెద్దగా కేకలు వేస్తుండటంతో శాంతినగర్‌ గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి చెట్ల కింద పడి ఉన్న డ్రైవర్‌ రవిని చూసి హైవే పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న హైవే సిబ్బంది డ్రైవర్‌కు కట్టిన కట్లు విప్పదీసి 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సమచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్వంలో గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు ఎస్‌ఐలు కంటైనర్‌ చోరీకి గురైన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. 

చికిత్స పొందిన అనంతరం డ్రైవర్‌ను తెట్టు తీసుకొచ్చి విచారించారు. తెట్టు జంక్షన్‌లో ఉన్న సీసీ కెమెరా పుటేజీని పక్కనే ఉన్న మార్కెట్‌ కార్యాలయం కంప్యూటర్‌లో పరిశీలించారు. కంటైనర్‌ సింగరాయకొండ వద్ద ఉన్న ఫెరల్‌ డిస్టిలరీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉందని సమాచారం రావడంతో విచారణ కోసం అక్కడికి వెళ్లారు. కంటైనర్‌ను హైజాక్‌ చేయడంలో సుమారు 20 మంది దుండగులు పాల్గొని ఉంటారని సమాచారం.  

బీహార్‌ గ్యాంగ్‌ పనేనా? 
బీహార్‌ రాష్ట్రానికి చెందిన పారంగి ముఠా సభ్యులు ఈ కేసులో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగిన విధానం ఆధారంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. వీరు క్రూరులని, చోరీ సమయంలో డ్రైవర్‌ను కచ్చితంగా చంపుతారని, ఇక్కడ ఉన్న నిందితుల్లో డ్రైవర్‌ను ఒకరు చంపుదామంటే మరొకరు చంపొద్దని వారించారని, చివరకు డ్రైవర్‌ను కట్టేసి కళ్లకు గంతలు చుట్టి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ కేసుకు పారంగి ముఠాతో సంబంధం ఉందా..లేదా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. 

హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహా చోరీ 
కంటైనర్‌ చోరీ తీరు ఇటీవల తమిళ నటుడు కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహాలో ఉందని పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి చోరీకి గురైన కంటైనర్‌ను మాత్రం పోలీసులు గుర్తించగలిగారు. అందులోని సిగరెట్‌ బాక్స్‌లను మాత్రం ప్రస్తుతానికి గుర్తించలేకపోయారు. ఐటీసీ కంపెనీకి చెందిన సిగిరెట్ల కంటైనర్‌ బెంగళూరు నుంచి ఈ నెల 23వ తేదీ రాత్రి పది గంటలకు విజయవాడలోని గూడవల్లి గోల్డెన్‌ రాయల్‌ వేర్‌ హౌసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బయల్దేరింది. 

కంటైనర్‌ తెట్టు సమీపంలోని శాంతినగర్‌ వద్దకు రాగానే సుమారు 10 మంది దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న మూడు లారీల్లో వచ్చి కంటైనర్‌ వెళ్లేందుకు వీల్లేకుండా ముందు, వెనుక లారీలు ఆపారు. ఆ తర్వాత కంటైనర్‌ డ్రైవర్‌ బి.రవిపై దాడి చేసి గాయపరిచి కంటైనర్‌తో పరారయ్యారు. సింగరాయకొండ ఎస్‌ఐ మేడా శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో శనివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో పెరల్‌ డిస్టిలరీ కంపెనీ వద్ద కంటైనర్‌ను హైవే పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించి ఆ సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. అయితే అప్పటికే కంటైనర్‌లో 531 సిగిరెట్‌ పెట్టెలు ఉండాల్సి ఉండగా కేవలం 125 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. చోరీ సొత్తు విలువ సుమారు 3.50 కోట్ల రూపాయలుగా పోలీసులు పేర్కొంటున్నారు. 

మిస్టరీగా కంటైనర్‌ చోరీ ఘటన.. 
కంటైనర్‌ చోరీ ఘటన మిస్టరీగా మారింది. చోరీ జరిగిన తీరు గమనిస్తుంటే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కంటైనర్‌కు జీపీఆర్‌ఎస్‌ సిస్టం ఉంది. దీని ప్రకారం కంటైనర్‌ ఎక్కడ ఉందో వెంటనే గుర్తించవచ్చు. కంటైనర్‌ను దుండగులు సింగరాయకొండ పట్టణం నుంచి పాకల రోడ్డు వరకు తీసుకొచ్చి మళ్లీ కావలి వైపు బయల్దేరి చివరకు పెరల్‌ డిస్టిలరీ కంపెనీ వద్ద వదిలి వెళ్లిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పోలీసులు జీపీఆర్‌ఎస్‌ విధానం ద్వారా కంటైనర్‌ను గుర్తించి వెళ్లేలోపు దుండగులు కంటైనర్‌ను ఫ్యాక్టరీ వద్ద వదిలి వేరే వాహనంలో కావలి వైపు పరారయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కంటైనర్‌ చోరీకి గురైన సమాచారం రిలయన్స్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అనుబంధ సంస్థ స్టెల్లార్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధికి సుమారు రాత్రి 11 గంటలకు అందింది. అంతేగాక కంటైనర్‌ సింగరాయకొండ వద్దే చోరీకి గురైందని వారికి పక్కా సమాచారం అందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement