తన స్వప్రయోజనాల కోసం విద్యార్థినులను లైంగికంగా ఎరవేసే ప్రయత్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి చెంప చెళ్లుమనేలా చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. పెద్దల వద్దకు తమను పంపడం ఎందుకు మీ ఇద్దరు కుమార్తెలను పంపవచ్చు కదా అని విద్యార్థినులు ప్రశ్నించి ఆమెను నిలదీసినా ‘వారు (తన కుమార్తెలు) వేరే లెవల్ అంటూ నిర్మలా దేవి నింపాదిగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థినులను కొందరు పెద్దల లైంగిక అవసరాలకు ప్రేరేపించి, ప్రలోభపెట్టిన విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో గవర్నర్ నియమించిన ఏకసభ్య కమిషన్ గురువారం విచారణ ప్రారంభించింది. ఉదయం చెన్నై నుంచి మదురై వెళ్లిన సంతానం అక్కడి ప్రభుత్వ అతిథిగృహంలో బసచేసి మదురై కామరాజర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ చెల్లదురై, రిజిస్ట్రారు చిన్నయ్య తదితరులను కమిషన్ చైర్మన్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం పిలిపించుకుని విచారించారు. విద్యార్థినులతో నిర్మలాదేవి సెల్‌ఫోన్ సంభాషణను పరిశీలించారు. నిర్మలాదేవికి సంబంధించిన సీసీటీవీ కెమెరా పుటేజీలు ఏమైనా ఉంటే అప్పగించా ల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈనెల 21వ తేదీన యూనివర్సిటీలోని వివిధ విభాగాధిపతులను , నిర్మలాదేవి పనిచేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని వేర్వేరుగా విచారించనున్నారు. వర్సిటీ వైస్ చాన్సలర్ చెల్లదురై మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ నియమించిన కమిషన్ విచారణ ప్రారంభమైందని, విచారణకు పూర్తి సహకరిస్తున్నామని తెలిపారు.
తొలి దశ మూడు రోజులు
తొలిదశ విచారణ మూడురోజులు సాగుతుందని కమిషన్ చైర్మన్ సంతానం తెలిపారు. తరువాత రెండో దశ వారంరోజుల చేపడుతామని అన్నారు. ఇదిలా ఉండగా, మద్యం, జల్సా పార్టీలతో మదురై కామరాజ్ యూనివర్సిటీ కేళీవిలాసాల్లో మునిగితేలుతున్నట్లు విచారణ కమిషన్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. పదినెలల్లో 200 ఉత్సవాలు, 60 మెగా పార్టీలు నిర్వహించగా కేవలం జీడిపప్పు కొనుగోలుకే రూ.18 లక్షలు ఖర్చు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణకు భయపడి కళాశాల అధ్యాపకులు ముఖం చాటేశారు. ఈ కేసు విచారణకు ఏడు బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. సైబర్ క్రైం పోలీసుల సహకారం తీసుకుంటున్నామని, నిర్మలాదేవి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నామని చెప్పారు.
పోలీసుల వద్దకు ఆధారాలు
నిర్మలాదేవికి సంబంధించి 26 పేజీలతో కూడిన ఆధారాలను సదరు విద్యార్థినులు అరుప్పుకోట్టై పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. లైంగిక కార్యకలాపాలకు అంగీకరించాల్సిందిగా కోరుతూ ఆమె పంపిన ఎస్‌ఎమ్‌ఎస్‌లను 20 పేజీలపై ముద్రించి అందజేసినట్లు సమాచారం. మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిని పంపవచ్చుకదా అని విద్యార్థినులు ప్రశ్నించగా, వారు వేరే లెవల్ అని నిర్మలాదేవి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం తానుగా ముందుకు వచ్చి విచారణ కమిటీని వేయాలని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కోరారు. గవర్నర్ వ్యవహార శైలిపై దృష్టి సారించాలని తమాకా అధ్యక్షుడు జీకే వాసన్ కేంద్రాన్ని కోరారు. నిర్మలాదేవి ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమెను ప్రత్యేక సెల్‌కు మారుస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment