నవజీవన్‌లో ఖాకీ రాబరీ..! | Cops Arrested In Navjeevan Express Robbery Case At Nellore | Sakshi
Sakshi News home page

ఖాకీలే దోపిడీ దొంగలు

Published Tue, Apr 30 2019 1:08 PM | Last Updated on Tue, Apr 30 2019 1:09 PM

Cops Arrested In Navjeevan Express Robbery Case At Nellore - Sakshi

విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడిస్తున్న రైల్వే డీఎస్పీ వసంతకుమార్‌  

నెల్లూరు(క్రైమ్‌): నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో నగదు దోపిడీకి పాల్పడిన కేసులో సూత్రదారులైన ముగ్గురు కానిస్టేబుల్స్, అందుకు సహకరించిన ఆర్‌ఐను సోమవారం నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. రైల్వే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోపిడీ ఘటనలో కానిస్టేబుల్స్, ఆర్‌ఐ పాత్రను రైల్వే డీఎస్పీ డాక్టర్‌ జీ వసంతకుమార్‌ వెల్లడించారు. కావలి గాయత్రినగర్‌కు చెందిన అనిత అదే పట్టణానికి చెందిన బంగారు వ్యాపారి మల్లికార్జునరావు వద్ద పనిచేస్తోంది. అనితకు కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రవితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతూ ఎలాగైనా బంగారు వ్యాపారిని బురిడీ కొట్టించి అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
(చదవండి : పక్కా స్కెచ్‌ వేశారు.. నగదు కొట్టేశారు!)

ఈ విషయాన్ని రవి తన సమీప బంధువైన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌(ప్రస్తుతం విజయవాడ డీఆర్‌ఎఫ్‌లో పనిచేస్తున్న) మహేష్‌కు తెలియజేసి సహకరించాలని కోరారు. దీంతో మహేష్‌ తన స్నేహితులైన సహచర కానిస్టేబుల్స్‌ షేక్‌  సుల్తాన్‌బాషా, వీ సుమన్‌కుమార్‌తో చర్చించి సహకరించాలని అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఐ పీ మల్లికార్జునను కోరాడు. అందకు స్నేహితులు, అధికారి సమ్మతించారు. దోపిడీ సొమ్మును అందరం పంచుకుందామని నిర్ణయించుకుని   అదను కోసం వేచిచూడసాగారు. సుల్తాన్‌బాషా, సునీల్‌కుమార్‌ నెల్లూరులోని ఓ లాడ్జిలో బసచేశారు.  ఈ నెల 15న బంగారు వ్యాపారి మల్లికార్జున రూ.50లక్షలు అనితకు  ఇచ్చి సీజన్‌బాయితో కలిసి చెన్నై వెళ్లి బంగారు బిస్కెట్లు తీసుకురావాలని సూచించాడు. దీంతో అనిత విషయాన్ని రవికి తెలియజేసింది.

తనతో పాటు స్నేహితురాలు, సీజన్‌బాయి, నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళుతున్నామని చెప్పింది. మహేష్‌కు విషయాన్ని చేరవేసిన రవి అతని సూచనల మేరకు అదే రైలులో ఆమెను వెంబడిస్తూ బయలుదేరాడు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో సూల్తాన్‌బాషా, సుమన్‌కుమార్‌ రైలు ఎక్కుతారని, పథకం ప్రకారమే దోపిడీ చేస్తారని మహేష్‌ తెలిపాడు. రైలు నెల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఎక్కారు. రైలు గూడూరు సమీపిస్తుండగా ఎస్‌11 కోచ్‌లోకి వెళ్లిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ తాము రైల్వే పోలీసులమని చెక్‌ చేయాలని అనిత, ఆమె స్నేహితురాలి వద్ద ఉన్న నగదు బ్యాగులను తీసుకున్నారు. బ్యాగులను చెక్‌ చేస్తున్నట్లు నటిస్తూ వాటిని తీసుకుని గూడూరు రైల్వేస్టేషన్‌లో దిగి వెళ్లిపోయారు. అనంతరం అందరూ అదే రోజు రాత్రి బిట్రగుంట వద్దకు చేరుకుని నగదు పంచుకున్నారు. రవి, సదరు మహిళ రూ. 20లక్షలు తీసుకోగా, కానిస్టేబుళ్లు ముగ్గురు చెరో రూ 8లక్షలు తీసుకున్నారు. ఆర్‌ఐ రూ.6లక్షలు తీసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

ఎవ్వరికీ అనుమానం రాకుండా అనిత నగదు దోపిడీ విషయాన్ని యజమానికి తెలియజేసింది. ఆయన సూచనల మేరకు దోపిడీ ఘటనపై గూడూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ డాక్టర్‌ వసంతకుమార్, సీఐ దశరథరామయ్య తమ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటుచేసి  కాల్‌డిటైల్స్, టవర్‌ లొకేషన్, రైల్వేస్టేషన్‌లోని సీసీఫుటేజ్‌ల ఆధారంగా విచారణ వేగవంతం చేయడంతో కేసులో చిక్కుముడి వీడింది.  సూత్రదారులు ఎం రవి, అనితను ఈ నెల 25వ తేదీన పోలీసులు  అరెస్ట్‌ చేశారు. తాజాగా అదే కేసులో పాత్రదారులైన ఏపీఎస్పీ (ప్రస్తుతం డీఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్న) కానిస్టేబుల్స్‌ సీహెచ్‌ మహేష్, షేక్‌ సుల్తాన్‌బాషా, వీ సుమన్‌కుమార్, వారికి సహకరించిన ఆర్‌ఐ పీమల్లికార్జునరావును సోమవారం నెల్లూరు రైల్వే ఇన్‌స్పెక్టర్‌ జీ దశరథరామయ్య తన సిబ్బందితో కలిసి అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.30లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

సిబ్బందికి అభినందన 
దోపిడీ కేసును చేధించి నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు చోరీకి గురైన రూ.50లక్షలను రికవరీ చేసిన నెల్లూరు రైల్వే ఇన్‌స్పెక్టర్‌ జీ దశరథరామయ్య, ఎస్‌ఐలు బాలకృష్ణ, కోటయ్య, హెడ్‌కానిస్టేబుల్స్‌ ప్రభాకర్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్‌ లావణ్య, పీవీ సురేష్‌బాబు, సతీష్, ఆనంద్, పెంచలయ్య, రమేష్, తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. 

ఖాకీలు,ఆర్‌ఐలపై చర్యలకు సిఫార్సు
ఆర్‌ఐ మల్లికార్జున ప్రస్తుతం ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మహేష్, సుల్తాన్‌బాషా, సునీల్‌కుమార్‌ నగదు దోపిడీ విషయం ముందుగానే ఆర్‌ఐ దృష్టికి తీసుకెళ్లారు. దోచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని ఇస్తామని ఆర్‌ఐతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఆయన సిబ్బందికి అనుకూలంగా లీవ్‌లు ఇవ్వడంతో పాటు వారు విధుల్లో ఉన్నట్లు ఇలా పలు విధాలుగా సహకరించాడని రైల్వే డీఎస్పీ వసంతకుమార్‌ వెల్లడించారు. దోపిడీ కేసులో పాత్రదారులైన ఖాకీలు, వారికి సహకరించిన  ఆర్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సుచేసినట్లు డీఎస్పీ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement