
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : కరోనా టెస్ట్ చేయించుకోలేదనే కారణంతో ఓ వ్యక్తిని అతని కజిన్స్ కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నూర్‌లోని మలక్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంజీత్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఢిల్లీ నుంచి మలక్‌పూర్‌కు చేరుకున్నాడు. దీంతో అతని కజిన్స్ కపిల్, మనోజ్.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అయితే ఇందుకు మంజీత్ నిరాకరిస్తు వచ్చాడు. ఈ క్రమంలో గురువారం మంజీత్‌కు అతని కజిన్స్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కపిల్, మనోజ్‌లు కర్రలతో మంజీత్‌పై దాడికి దిగారు. (చదవండి : కరోనా.. ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ మృతి)
ఈ ఘర్షణలో మంజీత్ తలకు గాయాలు కావడంతో అతను అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. వెంటనే మంజీత్ తల్లిదండ్రులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మంజీత్ చికిత్స పొందుతుండగానే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మంజీత్ తండ్రి కల్యాణ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మంజీత్ కజిన్స్ కపిల్, మనోజ్, వారి తల్లి పుణియా, మనోజ్ భార్య డాలీలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బిజ్నూర్ అడిషనల్ ఎస్పీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. మే 19వ తేదీన బిజ్నూర్‌కు చేరుకున్న సమయంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్టు తెలిపారు. అయితే అక్కడ నెగిటివ్ రావడంతో అతని శాంపిల్స్ తీసుకోలేదని చెప్పారు.