
ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో రవిప్రకాశ్‌కు సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో రవిప్రకాశ్‌కు సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సినీనటుడు శొంఠినేని శివాజీ, టీవీ 9 ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తికి కూడా ఇంతకుముందు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మూర్తి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవిప్రకాశ్ మాత్రం విచారణకు రాలేదు. వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు సమాచారం. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. కాగా, టీవీ9 సీఈవో, డైరెక్టర్ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నట్లు అలందా మీడియా గ్రూపు శుక్రవారం ప్రకటించిన సంగతి విదితమే.