సాక్షి, హైదరాబాద్ : అక్రమంగా నిధులు బదలాయింపు, ఫోర్జరీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలకు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు వీరివురు స్పందించని విషయం తెలిసిందే. దీంతో రవిప్రకాశ్, శివాజీలకు 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం లోపు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయనున్నారు. అప్పటికీ స్పందించని పక్షంలో కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. వీరు ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు...వీరిని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు రవిప్రకాశ్, శివాజీ ముందస్తు బెయిల్ కోసం క్వాష్ లేదా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. రవిప్రకాశ్, నటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిపై అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు రవిప్రకాశ్‌తో పాటు శివాజీ గైర్హాజరు కాగా, మాజీ సీఎఫ్‌వో మూర్తి మాత్రం పోలీసులు విచారణకు హాజరు అయ్యారు. విచారణలో ఎంవీఎస్ మూర్తి నుంచి పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల ఆధారంగా తప్పుడు బదలాయింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment