
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన వృద్ధుడికి కేవైసీ అప్‌డేట్ పేరుతో ఫోన్ చేసి, ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, రూ.8 లక్షలు కాజేసిన ఇద్దరు ఝార్ఖండ్ వాసుల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. వీరి చేతిలో మరికొందరు మోసపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్‌లోని జామ్‌తార జిల్లాకు చెందిన రాహుల్ మండల్, కపిల్ మండల్‌లతో కూడిన ముఠా గత ఏడాది సెప్టెంబర్‌లో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి కాల్ చేసింది.
తాము పేటీఎం నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న గ్యాంగ్ సభ్యులు కేవైసీ అప్‌డేట్ చేయాల్సి ఉందని చెప్పారు. దానికోసమే అంటూ ఓ లింకును పంపారు. దీన్ని క్లిక్ చేయడంతో ఆయన స్మార్ట్‌ఫోన్‌లోని క్విక్ వ్యూవర్ యాప్ డౌన్‌లోడ్ అయింది. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన దీనికి సంబంధించి ఓ పాస్‌వర్డ్ చెప్పిన నేరగాళ్లు దాన్ని యాక్టివ్ చేసుకునేలా చేశారు. అలా చేయడంతో బాధితుడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ల్యాప్‌టాప్‌లో కనిపించడం మొదలైంది. దీని ఆధారంగా ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.8 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వినియోగించిన ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్ళారు. జార్ఖండ్ వెళ్ళిన ప్రత్యేక బృందం రాహుల్, కపిల్‌లను అరెస్టు చేసి తీసుకువచ్చింది.
పది మంది బాధితులు
బ్యాంకు ఖాతాలతో పాటు పే టీఎం తరహా యాప్స్‌కు ఆధార్ లింకేజ్ అని, అప్‌గ్రేడ్ కోసమని, కేవైసీ అప్‌డేట్ చేయాలని ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు పెరిగిపోతున్నారు. ఇలాంటి కాల్స్‌కు స్పందించి వారు పంపిన లింకులు క్లిక్ చేయడం, వారు సూచించినట్లు ప్లే స్టోర్స్ నుంచి ఆయా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం చేయకూడదు. ఇలా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని ఖాతాల్లోని డబ్బు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఒక్క సోమవారమే ఇలాంటి బాధితులు పది మంది వచ్చి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఈ తరహాకు చెందిన యాప్స్ 11 గుర్తించాం. ఫోన్‌కాల్స్ వల్లో పడి వీటిని ఎవరూ డౌన్‌లోడ్ చేసుకోవద్దు. యాడ్సన్, క్విక్ వ్యూవర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్, యూనిఫైడ్ రిమోట్, ఎయిర్ మిర్రర్, వీఎన్‌సీ వ్యూవర్, రిమోట్ సపోర్ట్, పీసీ రిమోట్, ఎయిర్ డ్రైడ్, రిమోట్ వ్యూ... ఈ తరహ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ,హైదరాబాద్ సైబర్ క్రైమ్
Comments
Please login to add a commentAdd a comment