అంబులెన్స్‌లో కొడుకును తీసుకెళ్తున్న తండ్రి రవి ,సిరి మృతదేహం
వర్గల్(గజ్వేల్): వేములవాడలో దైవదర్శనం చేసుకుని వస్తున్న కుటుంబాన్ని ప్రమాదం వెంటాడింది. కారు టైరు పగిలి అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో పదమూడేళ్ల కూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కారు నడుపుతున్న తండ్రితోపాటు, తల్లి, కొడుకు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం వర్గల్ మండలం సింగాయపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగింది. గౌరారం ఎస్సై వీరన్న తెలిపిన సమాచారం ప్రకారం సికింద్రాబాద్ దమ్మాయిగూడకు చెందిన అడ్వకేట్ రవి శనివారం సాయంత్రం భార్య ప్రతిమ, కూతురు సిరి (13), కుమారుడు సాత్విక్ (7)లతో కలిసి దైవదర్శనం నిమిత్తం వేగన్ ఆర్ కారులో బయల్దేరారు. దైవదర్శనం అనంతరం ఆదివారం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
వర్గల్ మండలం సింగాయపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో కారు టైరు పేలి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టి అమాంతం రోడ్డుపై పడిపోయింది. వెనక సీటులో కూర్చున్న సిరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సాత్విక్ గాయాలపాలయ్యాడు. కారు నడుపుతున్న రవి, అతని భార్య ప్రతిమ స్వల్పంగా గాయపడ్డారు. ఓ వైపు కూతురు మరణం, మరోవైపు కొడుకు గాయాలపాలవడంతో వారు ఒకింత షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సికింద్రాబాద్ లోటస్ ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి సంబంధించి ఫిర్యాదు అందలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment