వివరాలు సేకరిస్తున్న సీఐ గోపినాథ్
శంకర్‌పల్లి: ఓ మహిళ ఆస్తి కోసం తన కుమారుడితో కలిసి అత్తను కాల్చి చంపేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎల్వర్తి అనుబంధ కొజ్జగూడలో మంగళవారం సాయంత్రం జరిగింది. సీఐ గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంసమ్మ(70)కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. గతేడాది కొడుకు చనిపోయాడు. అతడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కంసమ్మ గ్రామంలో ఉన్న పొలం విక్రయించి మెదక్ జిల్లా కాదులబాద్‌లో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. సదరు భూమిని తన ముగ్గురు కూతుళ్లతో పాటు తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే, ఈ విషయం కోడలు విజయకు తెలియడంతో మంగళవారం సాయంత్రం అత్తను నిలదీసింది.
తనకు భూమి ఎందుకు ఇవ్వవు అని గొడవపడింది. ఈక్రమంలో విజయ తన కుమారుడు శివతో కలిసి ఇంట్లో ఉన్న కంసమ్మపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటలు అంటుకొని కాలిన గాయాలతో ఇంటి గడప వద్దే కంసమ్మ మృతి చెందింది. ఇల్లు పూర్తిగా కాలి పోయింది. ఇరుగుపొరుగు వారు గమనించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, కంసమ్మను హత్య చేసిన అనంతరం విజయ, ఆమె కుమారుడు పరారయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తమ్ముడు కిష్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment