విధి ఆడిన నాటకంలో ఓ మహిళ భర్త బతికి ఉండగానే వైధవ్యం అనుభవించింది. చిన్నపిల్లలతో ఒంటరి అయిన ఆమె వారి భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడి, పెంచి, పెద్ద చేసింది. ముగ్గురు కుమారుల్లో ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది. ఓ మనుమరాలు, ఇద్దరు మనవళ్లతో కాలం గడుపుతోంది. హఠాత్తుగా భర్త ప్రత్యక్షమయ్యాడు. అదీనూ 27 ఏళ్ల తర్వాత శవమై!! ఒక్కసారిగా కుటుంబంలో ఒక్కసారిగా కుదుపు..నాన్న ఎలా ఉంటాడో తెలియని కన్నకుమారులకు ఆనందపడాలో, దుఃఖించాలో తెలియని స్థితి. ఆ శవం చెప్పిన జీవితగాథలోకి వెళితే..
తవణంపల్లె : తమిళనాడు రాష్ట్రం వేలూరు సమీపంలోని ఒడింగళ్‌కు చెందిన మణి 33 ఏళ్ల క్రితం అరగొండ వచ్చాడు. అరగొండలో కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. స్థానికులు చారాల దళితవాడకు చెందిన పునీతతో మణికి వివాహం చేశారు. మణి, పునీత దంపతులకు లవకుమార్ అలియాస్ కుట్టి, శ్రీనివాసులు, మనోహర్ అనే ముగ్గురు కుమారులు సంతానం. భార్య భర్తల మధ్య గొడవ రావడంతో 27 ఏళ్ల క్రితం భార్యను, చిన్న వయస్సులోని ముగ్గురు కొడుకులను వదలి వెళ్లిపోయాడు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం శూన్యం. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దూరమవడంతో పునీతకు దిక్కుతోచలేదు. చిన్న పిల్లలు..ఏ ఆసరా లేకుండా ఎలా బతకాలో తెలియని స్థితి నుంచి అన్నీ తానై, పిల్లల కోసం రెక్కలుముక్కలు చేసుకుంది. పెద్ద కొడుకు లవకుమార్ అలియాస్ కుట్టి పదవ తరగతి వరకు చదివి పాసయ్యాడు.
ఇప్పుడతని వయస్సు 30. టెన్త్ ఫెయిలైన రెండో కొడుకు శ్రీనివాసులు వయసు 28. ఇంటర్ వరకు చదివిన మూడో కొడుకు మనోహర్ వయస్సు 26. ఇద్దరు కుమారులకు వివాహమైంది. వారికీ పిల్లలు కలిగారు. అందరూ కూలీ పనులతో జీవనం సాగిస్తున్న వారే.! తన భర్త చనిపోయి ఉంటాడని భావించిన పునీత గుండెను రాయి చేయికుని కుమారులు, వారి పిల్లలతో ప్రస్తుతం కాలం వెళ్లదీస్తోంది. ఈ నేపథ్యంలో, గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ఓ వార్త ఆ కుటుంబాన్ని ఆనంద పడాలో, దుఃఖించాలో తెలియని అలౌకిక స్థితిలో తీసుకెళ్లింది. ‘ఈ మృతుడు ఎవరో?’ శీర్షికతో సాక్షి దినపత్రిలో కథనం ప్రచురితమైంది. వార్తలో వచ్చిన ఫొటో చూసి ఆ కుటుంబం, గ్రామస్తులతో కలిసి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీసింది. 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన మణి మృతదేహమది! చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మరణించాడు. అతను అనారోగ్యం తో ఆస్పత్రిలో చేరినప్పుడు ఇచ్చిన చిరునామాలో అరగొండ తన ఊరు అని పేర్కొన్నాడు. దీంతో ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంతో అరగొండ పరిసర గ్రామాల్లో పోలీసులు ఆరా తీశారు. మణి ఎవరో తమకు తెలియదని గ్రామస్తులు చెప్పారు. దీంతో మణి (60) మృతదేహాన్ని చిత్తూరు మార్చురీ ఉంచారు.
మృతుడి సంబంధీకులెవరైనా ఉంటే సంప్రదించాలంటూ పోలీసులు తెలిపిన సమాచారాన్ని సాక్షి ప్రచురించింది. గురువారం ఇది చూసిన లవకుమార్ తన తండ్రిని గుర్తుపట్టాడు. తల్లికి, తన సోదరులకు విషయాన్ని చెప్పాడు. అంతే! వారికిదో పెద్ద షాక్. మాటలు పెగల్లేదు. ఉన్నపళాన చిత్తూరు ఆస్పత్రికి పరుగులు తీశారు. మార్చురీలో అనాథలా పడి ఉన్న మణి మృతదేహాన్ని చూశారు. తన భర్తేనని పునీత సైతం గుర్తు పట్టింది. ఆస్పత్రి వర్గాలను సంప్రదించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఇదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment