నటుడు విశాల్, దర్శకుడు వడివుడైయాన్
సాక్షి, చెన్నై : నటుడు విశాల్ హీరోగా చిత్రం చేసిపెడతానని చెప్పి దర్శకుడు వడివుడైయాన్ మోసం చేసినట్లు ఓ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. చెన్నై, విరుగంబాక్కమ్, వేంకటేశన్ నగర్ మెయిన్ రోడ్డులో నరేశ్ బోద్రా అనే వ్యాపారవేత్త నివసిస్తున్నాడు. ఈయన సినిమా నిర్మాతగా మారాలని భావించారు. దీంతో దర్శకుడు వడివుడైయాన్ తన వద్ద నటుడు విశాల్ కాల్‌షీట్స్ ఉన్నాయని చెప్పి అందుకు ఒప్పందపత్రాలను చూపి సినిమా చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఒప్పందం కురుర్చుకున్న నరేశ్‌బోద్రా అందుకు రూ.47 లక్షలను దర్శకుడికి ఇచ్చాడు.
2016 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు విడతల వారీగా ఆ మొత్తాన్ని దర్శకుడు తీసుకున్నాడు. అయితే వడివుడైయాన్ చిత్రం చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో అనుమానం వచ్చి విశాల్‌తో చేసిన ఒప్పంద పత్రాలను పరిశీలించగా అవి నకిలీ అని తెలిసింది. దీంతో ఆ నిర్మాత సినిమా వద్దని తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే దర్శకుడు ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్లు నిర్మాత నరేశ్ బోద్రా మంగళవారం విరుగంబాక్కం పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శకుడు వడివుడైయాన్‌ను విచారించడానికి సిద్ధం అయ్యారు.
నరేశ్‌బోద్రా ఎవరో నాకు తెలియదు
కాగా దర్శకుడు వడివుడైయాన్ బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో నిర్మాత నరేశ్ బోద్రా ఎవరో తనకు తెలియదని, అతనితో తనకు ఎలాంటి పరిచయం లేదని తెలిపారు. తాను గత ఏడాది అశోక్ బోద్రా అనే వ్యక్తి నుంచి అప్పుగా రూ.3 లక్షలు తీసుకున్నానని, అందుకు ఒప్పందపత్రాన్ని రాసిచ్చినట్లు తెలిపారు. అయితే ఆ డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించేశానని, అయినా అతను తాను రాసిచ్చిన ఒప్పంద పత్రాన్ని తిరిగి ఇవ్వలేదని తెలిపారు. ఆ పత్రాన్ని అశోక్‌బోద్రా నిర్మాతగా చెప్పుకుంటున్న నరేశ్‌బోద్రాకు ఇచ్చి ఉంటాడనే అనుమానం కలుగుతోందని, ఈ వ్యవహారాన్ని తాను చట్టబద్దంగా ఎదుర్కొంటానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment