ఆసిఫాబాద్‌లో ఆటోలో మైక్‌తో ప్రచారం చేస్తున్న పోలీసులు
సాక్షి, ఆసిఫాబాద్ : రోజురోజుకు తండాలు, గ్రామాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో అనేక రకాల వదంతులు స్థానికులను పరేషాన్ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో గ్రామాల్లోకి దొంగలు వస్తున్నారని ప్రచారం జరుగుతుండడంతో గ్రామాల్లో ఎవరైనా కొత్త వారు వచ్చినా అనుమాతులుగా భావిస్తున్నా రు. వివిధ పనుల నిమిత్తం కొత్తవాళ్లు గ్రామాలకు వెళ్తుంటారు. అయితే వాట్సాప్ మెసేజ్‌ల్లో దొంగ ల ముఠా సంచరిస్తుందని వివిధ రకాల పుకార్లు వస్తుండడంతో స్థానిక ప్రజానీకం ఇదంతా నిజ మని భావిస్తూ కొత్త వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో బుధవారం జైనూర్ మండలం కర్ణంగూడలో విద్యుత్ లైను పనులు చేసేందుకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన నలుగు రు వ్యక్తులు రాగా వారిని ఆ ఊరు ప్రజలు దొంగలుగా భావించి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయితే వాస్తవానికి వారంతా కరెంట్ లైన్ల పనులు చేసేందుకు వచ్చినవారు. కాని అప్పటికే వారిని గ్రామస్తులు ఎంతా చెప్పినా వినకుండా ఓ ఇంట్లో బంధించడం.. వారు ఏమి చెప్పినా వినకపోవడంతోపాటు ఆ క్షణం ఆ గ్రామస్తులంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.
గత కొద్ది రోజులుగా పుకార్లు
గత కొద్ది రోజులుగా వాట్సాప్, పేస్‌బుక్‌లో బిహార్ నుంచి ఓ ముఠా తెలంగాణలో సంచరిస్తోందని, వారు చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని, లూఠీలకు పాల్పడుతున్నారని విపరీతంగా సోషల్ మీడియాలో మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. అయితే వాస్తవానికి తెలంగాణ వ్యాప్తం గా ఎక్కడా ఇటువంటి ఘటనలు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నారు. అలాంటి ముఠాలు సంచరించడం కాని, కిడ్నాప్‌లపై గానీ ఏ పో లీస్‌స్టేషన్ పరిధిలోనూ కేసులు నమోదు కాలేదని పేర్కొంటున్నారు. అయినా స్థానికులు కొత్త వారి ని అనుమానంగా చూడడంతోపాటు ఏకంగా దా డులకు దిగడం పోలీసులకు సమస్యగా మారింది.
జిల్లాలో అటువంటి కేసులు ఎక్కడా నమోదు కానప్పటికీ లేనిపోని భయాలు ఊహించుకొని కొత్త వారిని ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కర్ణాటకలో గతేడు డిసెంబర్‌లో అక్కడి అటవీ ప్రాం తంలో స్థానిక గిరిజనులపై ఎలుగుబంటి దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోను ఇటీవల ఎవరో వాట్సాప్‌లో పోస్టు చేశారు. ఆ వీడియో కింద కుమురం భీం జిల్లా అడవుల్లో జరిగినట్లు ఎవరో తప్పుడుగా పోస్టు చేయడంతో అటవీ అధికారులు, పోలీసులు అంతా ఉలిక్కిపడ్డారు. అయితే ఇలాంటి ఘటన ఎక్కడా జరగదలేని నిర్దారించుకోవడానికి ఒక రోజంతా పట్టింది. అప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి తప్పుడు సందేశాలను స్థానికులు నమ్మడంతో పల్లెల్లో భయాలు మొదలయ్యాయి.
ఊరురా పోలీసుల ప్రచారం
ఇలాంటి పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా అన్ని మండలాలు, గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆటోల్లో మైకులతో వాడవాడలా తిరుగుతూ స్థానికులను అనవసర వదంతులు నమ్మవద్దని కోరుతున్నారు. అన్ని జనసంచార ప్రదేశాల్లోనూ పుకార్లను నమ్మవద్దని సూచిస్తున్నారు. అయినా జైనూర్‌లో ఈ ఘటన జరగడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. వదంతులు నమ్మద్దని ఇంతా ప్రచారం చేసినా స్థానికులు కొత్త వారిపట్ల దాడులు దిగడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోందని అంటున్నారు. ఇటువంటి దాడులకు ఎవరూ పాల్పడవద్దని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఎవరైనా అనుమానంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే తమకు ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటున్నారు. అంతే గానీ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరుతున్నారు. కావాలని ఎవరైనా వాట్సాప్, పేస్‌బుక్‌ల్లో ప్రచారం చేస్తే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment