తలమడుగు :గ్రామాల్లో ప్రజలకు సోషల్‌మీడియాపై అవగాహన కల్పిస్తున్న ఎస్సై సుబ్బారావు
నేరడిగొండ : దొంగలు పడి పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారని సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలతో గ్రామాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. నాలుగు రోజులుగా వ్యాపిస్తున్న వదంతులతో పల్లెలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వదంతులతో పల్లెజనం భయంగా బతుకుతున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు గ్రామా ల్లో తిరుగుతూ పిల్లల్ని ఎత్తుకుపోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారం పిల్లల తల్లిదండ్రులను, ప్రజలను భయాందోళకు గురి చేస్తోంది. సోషల్ మీడియా వదంతులు ప్రధానం గా అసత్య ప్రచారానికి వేదికగా మారింది. ఎప్పుడో జరిగిన సంఘటనలకు కొన్ని అంశాలు జోడించి పోస్ట్ చేస్తుండడంతో వేగంగా అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇది వాస్తవమా కాదా అని తెలియకుండానే ఎవరికి తోచినట్లు వారు వీటిని ఇతరులకు షేర్ చేస్తుండడం భయాందోళనలకు తావిస్తోంది. గ్రామాల్లో రైతులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడుతూ ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తున్నారు. మరీ చీకటి పడిందంటే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఎండా కాలం కావడంతో బయట నిద్ర చేయకుండా జాగరణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికి దొంగల పుకార్లతో ప్రజలు నిత్యం భయంగా గడపాల్సిన పరిస్థితి. దీనిపై పోలీసులు కల్పించుకొని ప్రజలకు అభయం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
మీకు మేమున్నాం..పుకార్లు నమ్మవద్దు
భీంపూర్: గ్రామాల్లో దొంగల దాడులు, హత్యలు, పిల్లలను కిడ్నాపులు చేస్తున్నట్లు సోషల్‌మీడియాలోని వాట్సప్, ఫేస్‌బుక్‌లో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని, మీకోసం అన్ని వేళల్లో మేమున్నామని స్టేషన్ హౌస్ మాస్టర్ లింగన్న కోరారు. మండల కేంద్రంలో ఆదివారం సంతలో ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించారు. సమాజం పట్ల అవగాహన లేని పోకిరీలు ఇలా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వాటిలో ఎలాంటి వాస్తవాలు, నిజాలు లేవని ప్రజలు గుర్తించాలన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను, వీడియోలను పరిగణలోకి తీసుకోవద్దని, పోలీసులపై విస్వాసంతో గ్రామాల్లో యధావిధిగా పనులు చేయాలని కోరారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు, లేదా 100 నంబర్‌కు ఫోన్ ద్వారా తెలియజేసి బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పారు. ఇలాంటి వీడియోలను, వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిపై నిఘా ఉందని, వారిపై చట్టరీత్యా తగు చర్యలు తప్పవన్నారు. ఎలాంటి భయాం దోళనలకు గురికాకుండా రోజువారి కార్యక్రమా లు చేపట్టాలని, ప్రజలకు ఎల్లవేళలా మేమున్నామంటూ భరోసా కల్పించారు. సర్పంచ్ మానిక్‌రా వు, పురుషోత్తం, అమ్రుత్, సిబ్బంది సుధాకర్, మల్లేశ్, ఆయాగ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
పుకార్లు నమ్మవద్దు
తలమడుగు : సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రజలు ఎవరూ భయాభ్రాంతులకు గురి కావద్దని ఎస్సై సుబ్బారావు అన్నారు. ఆదివారం మండలంలోని రుయ్యడి, బరంపూర్ గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తు న్న వార్తలను నమ్మవద్దని అన్నారు. గ్రామాల్లో కొత్తగా వ్యక్తులు కన్పించినా సంచరించినా వెంట నే సమాచారం అందించాలన్నారు. ప్రజలకు అం దుబాటులో పోలీసులు ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా వెం టనే 100కు ఫోన్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది జనార్దన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment