ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ యుగంలో చేతిలో ఉన్న ఫోన్ స్మార్ట్‌గా పనిచేయకపోతే వెనకబడిపోతాం. దానిలో ఏ చిన్న లోపం తలెత్తిన ఆగమేఘాలపై రిపేర్ సెంటర్లకు పరుగెడతాం. అయితే, తగు జాగ్రత్తలు తీసుకోకుండా రిపేరర్ చెప్పే కస్టమర్ ఫ్రెండ్లీ మాటల్లో పడి గోప్యంగా ఉంచాల్సిన ఫోన్ పాస్‌వర్డ్ చెప్తే నట్టేట మునిగినట్టేనని అంటున్నారు కొందరు బాధితులు. ఫోన్ రిపేర్ కోసం వెళ్తే తన వ్యక్తిగత ఫోటోలను లూటీ చేసి ఎలా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారో శ్వేతా దీక్షిత్(27) అనే యువతి పోలీసులకు చెప్పుకుని వాపోయారు.
‘నా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పగిలిపోవడంతో రిపేర్‌కోసం కరోల్‌బాగ్‌లోని గఫార్ మార్కెట్‌కి గత నెలలో వెళ్లాను. రిపేర్ నిమిత్తం ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని షాప్ అతను అడిగాడు. రిపేర్ చేయాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరిగా కావాలన్నాడు. అతని మాటలు నమ్మి పాస్‌వర్డ్ చెప్పాను. ఎలాగైతేనేం ఫోన్ బాగయితే చాలు అనుకున్నాను. మూడు గంటల అనంతరం ఫోన్ బాగుచేసి తిరిగిచ్చాడు. కానీ, మూడు రోజుల అనంతరం అసలు కథ మొదలైంది. అపరిచిత నెంబర్ల నుంచి బ్లాక్‌మెయిలింగ్ కాల్స్ వచ్చాయి. నీ వ్యక్తిగత ఫొటోలు మావద్ద ఉన్నాయి. లక్ష రూపాయల్వికుంటే వాటిని యూట్యూబ్‌లో, పోర్న్ సైట్లలో పెడతామని బెదిరింపులకు గురిచేశారు. ఊహించని పరిణామం ఎదురవడంతో బిత్తరపోయాను. ఘటనపై ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని చెప్పారు.
‘శ్వేత ఫిర్యాదుపై విచారణ చేపట్టాం. మొబైల్ రిపేర్ చేసిన వ్యక్తే ఫోటోలు దొంగిలించాడని తేలింది. అయితే, ఫోన్ నెంబర్లు నకిలీ చిరునామాలతో ఉండటంతో నిందితులను గుర్తించడం కష్టమవుతోంది. దర్యాప్తు కొనసాగుతోంది. కస్టమర్ల వ్యక్తిగత ఫొటోలు, సమాచారం దొంగిలించి బ్లాక్‌మెయిర్లకు షాప్ వాళ్లు అమ్ముకుంటున్నట్టు మా విచారణలో తేలింది. అందుకే ఫోన్ రిపేర్‌కు ఇచ్చేటప్పుడు అందులో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని డిలీట్ చేసి ఇవ్వాలి. యువతులే టార్గెట్‌గా బ్లాక్‌మెయిలర్లు పంజా విసురుతారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు యువతులు చిత్రవధ అనుభవిస్తారు. బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యకు యత్నించిన వారూ ఉన్నారు. ప్రైవేటు వ్యవహారాలు పబ్లిక్ అవుతాయేమోనని ఫిర్యాదు చేయడం కూడా అరుదే. ఒకవేళ ఫిర్యాదు చేయాల్సివస్తే ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు’ అని ఢిల్లీ సైబర్‌క్రైం డిప్యూటీ కమిషనర్ అనీష్‌రాయ్ చెప్పారు. ఇక డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తిరిగి రిట్రైవ్ చేసే కేటుగాళ్లు ఉండటం కలవరపెట్టే అంశం.
Comments
Please login to add a commentAdd a comment