ఆగని ‘కల్తీ’ మద్యం దందా..! | Duplicate Liquor Business Rampant In Yadadri District | Sakshi
Sakshi News home page

ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!

Published Thu, Sep 5 2019 10:36 AM | Last Updated on Thu, Sep 5 2019 10:36 AM

Duplicate Liquor Business Rampant In Yadadri District  - Sakshi

సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఏడాది కాలంగా కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున కొనసాగుతున్నా ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బెల్టుషాపులు కేంద్రంగా నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న అనుమానం మద్యం ప్రియులు వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తో మద్యాన్ని తయారు చేసి పలురకాల బ్రాండ్లతో విక్రయించిన తీరు మద్యంప్రియులను తీవ్రంగా కలిచివేస్తోంది.

ఎన్నికల సీజన్‌లో కల్తీ మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాల ద్వారా, బెల్టుదుకాణాల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం విక్రయదారులను పోచంపల్లితోపాటు, బాలాపూర్, వికారాబాద్‌లలో అరెస్టు చేశారు. మరో నెలరోజుల్లో మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఎక్సైజ్‌ పోలీస్‌లు పట్టుకున్న మద్యంతో చీకటి వ్యాపారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదిమంది నిందితులు అరెస్ట్‌ చేసిన పోలీస్‌లు మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. 

ఒరిజనల్‌గా నమ్మిస్తూ:
అక్రమ మద్యం వ్యాపారులు రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను తమ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి పలురకాల బ్రాండ్లకు చెందిన మూతలు, లేబుళ్లను కొనుగోలు చేసి పాత సీసాల్లో రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను నింపి వాటిలో మద్యం రంగు వచ్చే విధంగా క్యారామాల్‌ లిక్విడ్‌ను కలిపారు. మద్యం కొనుగోలుదారునికి ఎలాంటి అనుమానం రాకుండా ప్యాక్‌ చేసి ప్రభుత్వ సరఫరా లేబుళ్లను అంటించి అన్ని రకాల మద్యాన్ని డూప్లికేట్‌ సీసాల్లో ఒరిజినల్‌ ధరకే విక్రయించారు. 

బయటబడిన బండారం..
భూదాన్‌పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్‌లో గత నెల 14న రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తో క్యారామిల్‌ కలిపి మద్యాన్ని తయారు చేస్తున్న మద్ది అనిల్‌రెడ్డితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి లక్షల రూపాయలు విలువ చేసే రెక్టిఫైడ్‌ స్పిరిట్, క్యారామిల్‌ మద్యం సీసాల మూతలను పలు బ్రాండ్లకు సంబంధించిన లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుమారు 10మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరికొంత మంది కోసం గాలింపు చేపట్టారు. భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్‌ శివారులో గత నెల 19న పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు 10మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మరో నలుగురి కోసం వెతుకుతున్నారు.

భూదాన్‌పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న స్పిరిట్, సామగ్రి, మద్యం సీసాల మూతలు (ఫైల్‌)

మూడు నెలలుగా జిల్లాలో నకిలీ మద్యం ఛాయలు గుర్తించినట్లు ఎక్సైజ్‌ పోలీసులు చెబుతుండగా అంతకంటే ముందు ఏడాది కాలంనుంచే కల్తీ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో తాజాగా మద్యం సీసాల నకిలీ మూతలను విక్రయించే హైదరాబాద్‌కు చెందిన లాయిఖ్‌అలీ, స్టిక్కర్స్‌ను విక్రయించే హైదరాబాద్‌కు చెందిన సుదీర్‌లను ఇప్పటికే అరెస్టు చేయగా తాజాగా స్పిరిట్‌ను సరఫరా చేసే తాండూరుకు చెందిన మొగులప్ప స్టిక్కర్స్‌ను కొనుగోలు చేసిన మహబూబాబాద్‌కు చెందిన శశాంక్‌గౌడ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే ఢిల్లీలో హోలోగ్రామ్స్‌ తయారు చేసే కంపెనీపై దృష్టిసారించిన పోలీసులు అక్కడి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ మద్యం కేసులో కర్ణాటకకు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు చొప్పున నిందితుల వేటలో పోలీసులు బిజీగా ఉన్నారు. 

బెల్టుషాపుల ద్వారా విక్రయం..
నకిలీ మద్యం కొన్ని మద్యం షాపులతోపాటు బె ల్టుషాపుల్లో పెద్ద ఎత్తున విక్రయించినట్లు ఎక్సైజ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నారా యణపూర్, చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లో మద్యం దుకాణాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులై న అనిల్‌రెడ్డితోపాటు మరికొంత మంది తమ కు తెలిసిన వారి ద్వారా జిల్లాతోపాటు హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌జిల్లాల్లో విక్రయించినట్లు ఇప్పటికే బయటపడింది. నకిలీ మద్యం కేసును ఛేదించడం ద్వారా జిల్లాలో భారీ రాకెట్‌కు తెరదించినట్లైందని ఎక్సైజ్‌ పోలీసులు భావిస్తున్నారు. నిందితులందరినీ పట్టుకుం టామని ఎక్సైజ్‌ పోలీసులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement