అలేఖ్య (ఫైల్)
గండేపల్లి (తూర్పుగోదావరి) : ఇంజినీరింగ్ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై బి.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన కిలుకూరి అలేఖ్య (19) మండలంలోని సూరంపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ సెకండ్ ఇయర్ చదువుతూ, అదే కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటోంది. కొంతకాలం నుంచి తలనొప్పితో బాధపడుతూ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. ఆదివారం ఉదయం 6.40 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె తాను ఉంటున్న హాస్టల్లోని నాల్గో అంతస్తు పైనుంచి కిందకు దూకేసింది. ఆమె తలకు బలమైన గాయమై రక్తస్రావం జరిగింది. పక్కగదిలో ఉన్న హాస్టల్ విద్యార్థినులు ఈ విషయం గమనించి వార్డెన్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను కళాశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమ్తితం కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి ప్రసాద్ రెడ్డి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై తెలిపారు.
ప్రగడవరంలో విషాదఛాయలు
చింతలపూడి: విద్యార్థిని ఆత్మహత్యతో స్వగ్రామం ప్రగడవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన చిలుకూరి ప్రసాద్‌రెడ్డి, నాగమణి దంపతుల కుమార్తె అలేఖ్య. విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన కాకినాడ తరలివెళ్లారు. చదువులో చలాకీగా ఉండే అలేఖ్య మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment