అంతా ఓపెన్‌..! | Everything is open! | Sakshi
Sakshi News home page

మారని పరీక్షల తీరు

Published Mon, Apr 23 2018 1:12 PM | Last Updated on Mon, Apr 23 2018 1:12 PM

Everything is open! - Sakshi

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌):  తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలు వసూలు రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కలెక్టర్, డీఆర్వో సమీక్షలు పరీక్షల నిర్వహణ తీరును మార్చలేకపోయాయి. ఆది నుంచీ అదే తీరు కొనసాగుతోంది.

పరీక్షలకు ముందుగానే వసూళ్లకు పాల్పడటంతో చివరకు కలెక్టర్‌ ఆదేశించినా నిర్వహణలో మార్పు రాలేదు. ఒకదశలో కొంత పకడ్బందీగా నిర్వహించడంతో డబ్బులు ఇచ్చిన అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాస్‌ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయించడం మొదటి నుంచి కొనసాగుతూ వచ్చంది.  

హెచ్చరికలు తుంగలోకి.. 

ఓపెన్‌ పరీక్షల్లో అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు విధు లు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. వీరే మాస్‌కాపీయింగ్, చూచిరాతలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కమిషనర్‌ శనివారం అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లకు పరీక్ష విధుల నుం చి తప్పించాలని ఆదేశాలు జారీచేశారు. అయితే వాటి ని తుంగలోకి తొక్కి ఆదివారం వారు యథావిధిగా వి ధులు నిర్వహించినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లాకేం ద్రంలోని శంకర్‌భవన్, మాణిక్‌భవన్, ఖిల్లా, దుబ్బ, ఆర్మూర్‌లోని ఓ పరీక్షాకేంద్రంలో అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లు విధులు నిర్వహించినట్లు సమాచారం.

బాన్సువాడలో ఒకరికి బదులు మరొకరు..

బాన్సువాడ టౌన్‌: పట్టణంలోని కోన బాన్సువాడ ఉన్నత పాఠశాలలో కొనసాతున్న ఓపెన్‌ ఎస్సెస్సీ పరీక్షలకు ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసిన విషయంలో ప్రభాకర్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఓపెన్‌ టెన్త్‌ సాంఘిక శాస్త్రం పరీక్షకు కారెగాం తండాకు చెందిన రమావత్‌ నారాయణకు బదులుగా ప్రభాకర్‌ అనే వ్యక్తి పరీక్ష రాస్తున్నాడు. దీంతో పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని సీఎం తెలిపారు. హెచ్‌ఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.   

‘సమూల మార్పులు’ ఇవ్వని ఫలితం

ఓపెన్‌ పరీక్షల్లో జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతుండడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఆర్వో వినోద్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు(డీవో), ఇన్విజిలేటర్లను సమూలంగా మార్చేయాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు వీరిని పూర్తిగా మార్చేసి విధులు కేటాయించారు.

అయినా పాత కథే. మాస్‌ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. అదే రీతిలో పరీక్షలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్, ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌ పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు ముగిసే సమయంలో వచ్చి తూతూమంత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోతుండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎనిమిది మాల్‌ప్రాక్టిస్‌ కేసులు.. 

నిజామాబాద్‌ జిల్లాలో సాగుతున్న ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షల్లో ఆదివారం 8 మాల్‌ప్రాక్టిస్‌ కేసులు నమోదయ్యాయి. ఎస్సెస్సీలో ఐదోరోజు సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. 8 కేంద్రాల్లో 1654 మంది అభ్యర్థులకు 1534 మంది హాజరు కాగా, 120 మంది రాయలేదు. ఇంటర్‌లో ఐదోరోజు కెమిస్ట్రీ పరీక్షను నిర్వహించారు. 3 కేంద్రాల్లో 179 మంది అభ్యర్థులకు 160 మంది హాజరుకాగా, 19 మంది గైర్హాజరయ్యారు.

మాల్‌ ప్రాక్టిస్‌ కేసుల్లో శంకర్‌భవన్‌లో ఇద్దరు, కోటగల్లి బాలికల పాఠశాలలో ఇద్ద రు, మాణిక్‌భవన్‌లో నలుగురు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. మాణిక్‌భవన్‌ పరీక్షాకేంద్రంలో చూచిరాతలు, ఒకరికి బదులు మరొకరు, ఇద్దరు ఒ కేచోట కూర్చొని పరీక్షలు రాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement