సాక్షి, గుంటూరు: జిల్లాలో మరో నకిలీ భాగోతం బయటపడింది. ఇప్పటికే కారం, నకిలీ పురుగు మందులు, మెడిసిన్, నూనె, నెయ్యి ఇలా ప్రతి వస్తువునూ నకిలీ మయం చేసేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె మండలం తుమ్మల పంచాయతీ పరిధిలోని గాదెవారిపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న కేంద్రంపై మంగలవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. పాడుపడిన ఇంట్లో 250 లీటర్ల స్పిరిట్, 21 కేసుల (1248 సీసాల) నకిలీ మద్యం, 20 బ్యాగుల ఖాళీ సీసాలు, క్యాప్ ఫిట్టింగ్ మిషన్, స్వాధీనం చేసుకున్నారు. బ్రాంది షాపు నిర్వాహకులు గుమ్మడి సాంబశివరావుతోపాటు, కొల్లూరు మండలం లంబాడి తండాకు చెందిన రమావత్ సాంబశివ నాయక్‌లను అరెస్టు చేశారు.
స్పిరిట్‌లో రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, ఇక్కడ తయారు చేసిన నకిలీ మద్యం ఏయే ప్రాంతాలకు సరఫరా అవుతుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసర్స్ చాయిస్, ఓల్డ్ ట్రావెన్ అనే బ్రాండ్‌లకు చెందిన ఖాళీ మద్యం సీసాలను సేకరించి వాటిలో నకిలీ మద్యం నింపుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇందులో 960 సీసాల ఆఫీసర్స్ చాయిస్ విస్కీ, 288 సీసాల ఓల్డ్‌ట్రావెన్ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మద్యం సిండికేట్‌లతో నకిలీ మద్యం తయారీ కేంద్రం దారులకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో కలకలం
జిల్లాలో నకిలీ మద్యం కేంద్రం నడుస్తుందనే విషయం బయటపడడంతో తీవ్ర కలకలం రేపింది. నకిలీ మద్యం ఏయే దుకాణాలకు సరఫరా అవుతుందనే విషయం బయటపడకపోవడంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ బీ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కల్తీ మద్యం తయారు చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని వెనుక ఎంతటివారినైనా వదిలేది లేదంటూ స్పష్టం చేశారు. దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ ఆవులయ్య, సీఐ సూర్యనారాయణ, ఏఈఎస్ అరుణకుమారి, ఎస్సై మోహన్‌రావు, రేపల్లె ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి, ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment