
హేమలత (ఫైల్)
పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్నాడని రూ.25వేల జీతం వస్తుందని చెప్పి ఉద్యోగం లేకుండా ఆవారాగా తిరుగుతున్నాడని ఆరోపించారు.
రాంగోపాల్‌పేట్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శీగుట్టకు చెందిన శ్రావణ్‌కుమార్, జ్యోతి దంపతుల కుమార్తె హేమలత (23)కు ఆదయ్యనగర్‌కు చెందిన విజయలక్ష్మి, నర్సింగ్‌రావు దంపతుల కుమారుడు కిరణ్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.4.5 లక్షల కట్నం, బంగారు నగలు ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. కిరణ్, హేమలత ఆదయ్యనగర్‌లో నివసిస్తుండగా తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అత్త, మామ, భర్త, ఆడపడుచు అదనపు కట్నం తేవాలని ఆమెను వేధిస్తున్నారు. వారి వేధింపులు తాళలేక హేమలత గత జనవరిలో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలియడంతో కిరణ్ కేసు వాపసు తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కేసు వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత కూడా కిరణ్ అతడి కుటుంబ సభ్యులు తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు.
కొద్ది రోజులుగా బైక్ కొనుక్కునేందుకు డబ్బు తీసుకు రావాలని ఒత్తిడి చేస్తుండటంతో సోమవారం ఉదయం ఆమె సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తన భర్తకు మరో పెళ్లి చేస్తామని అత్త, మామ, ఆడపడుచు బెదిరిస్తున్నారని, పెద్ద మనుషులను పిలిపించి పంచాయితీ పెట్టించాలని కోరింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు హేమలత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో ఆమె కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆదయ్యనగర్ చేరుకున్నారు. అత్తింటివారే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. హేమలత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తున్నాడని రూ.25వేల జీతం వస్తుందని చెప్పి తమను మోసం చేశారని, అతను ఉద్యోగం లేకుండా ఆవారాగా తిరుగుతున్నాడని ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.