
ఆదిలాబాద్ : వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధంపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కొలాంగూడకు చెందిన వివాహిత మడావి సునీత(41), ఇదే గ్రామానికి చెందిన టేకం గోవింద్(26)కు మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 21న ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. సునీత భర్త నాగోరావ్ శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం వారిద్దరి మృతదేహాలు కొలాంగూడ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పత్తిచేనులోని గుడిసెలో కనిపించాయి. సునీత, గోవింద్ శుక్రవారం రాత్రి చేను వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయోననే భయంతో వీరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సునీత చీరతో చేరో వైపు ఉరేసుకోవాలని ఏర్పాటు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఉరికి సునీత అంగీకరించకపోవడంతో అక్కడే ఉన్న గొడ్డలితో ఆమె గొంతుపై నరికి ఆ తర్వాత గోవింద్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. సునీతకు కూతురు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.