అంటే పరోక్షంగా ఇది వారి కళ్లకు కూడా పరీక్షా కాలమే.. ముఖ్యంగా డిజిటల్ లెర్నింగ్ సర్వసాధారణంగా మారిన పరిస్థితుల్లో రాత్రి పగలూ తేడా లేకుండా కళ్లను తప్పని సరి శ్రమపెట్టాల్సిన విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌కు చెందిన కన్సెల్టంట్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ మాధవి మాజేటి సూచిస్తున్నారు. ఆమె అందిస్తున్న సూచనలివే...
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ సమయాల్లోనే గంటల కొద్దీ కంప్యూటర్ స్క్రీన్స్, మొబైల్ ఫోన్ స్క్రీన్స్‌కు కళ్లను అతికించేసే విద్యార్థులు కంటి ఆరోగ్యం గురించి తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. మరోవైపు పరీక్షల సమయంలో వారి చదువులు కూడా ఆన్‌లైన్ ఆధారితం కావడం, ఇంటర్నెట్ నుంచి మెటీరియల్ తీసుకుని వారి ప్రాజెక్టులు సబ్‌మిట్ చేయాల్సి ఉండటం వల్ల దీర్ఘకాలం కంప్యూటర్ స్క్రీన్ల పైనే దృష్టి నిలపడంతో కంటి సమస్యలు ఈ సీజన్‌లో మరింత పెరుగుతున్నాయి. కంప్యూటర్స్, ట్యాబ్స్, ప్యాడ్స్, మొబైల్ ఫోన్స్.. ఇవన్నీ సమస్యల కారకాలే కాగా కంటి సమస్యల లక్షణాలు స్పష్టంగా కనపడతున్నాయి. పరీక్షల సమయం కదాని వీటిని నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్రమైన దుష్పరిణామాలకు దారి తీస్తాయి.
ఐస్ట్రెయిన్ నుంచి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ దాకా..
దీర్ఘకాలం పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు అతుక్కుపోయి ఉండటం కారణంగా ఈ సమస్య వస్తోంది. దీని వల్ల కళ్లు పొడిబారడం, దురద, ఎర్రబడటం, మంటగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి. తద్వారా చూపు మసకబారుతోంది. దృష్టి నిలపడం కష్టతరమవుతోంది. నిద్రలేమి సమస్య రావచ్చు. తెలియని అలసట ఆవరిస్తుంది. దీర్ఘకాలం పాటు కంప్యూటర్ స్క్రీన్లపై నిలిపే దృష్టి, కళ్లను తరచూ అటూ ఇటూ తిప్పడం, వేగంగా ఇమేజెస్ మార్చి మార్చి చూడటం.. కంటి కండరాలను అలసటకు గురి చేస్తాయి. రెటీనా ఇబ్బందులు, కాటరాక్టస్ వగైరా సమస్యలకు కారణమవుతోంది. దీనినే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు.
మార్పులు చేర్పులు అవసరం..
కంప్యూటర్ స్క్రీన్‌లో బ్రైట్ నెస్, ఫాంట్ సైజ్ తగ్గించడం, మానిటర్ హైట్ కంటిచూపునకు తగ్గట్టు అమర్చుకోవడం, స్క్రీన్‌కు కళ్లకు మధ్య దూరం సరిచూసుకోవడం వంటి మార్పులు చేసుకోవాలి. ఆప్తమాలజిస్ట్‌కు చూపించుకుని అవసరమైతే కంటి అద్దాలు తప్పక ఉపయోగించాలి. అలాగే నిర్విరామంగా స్క్రీన్‌ను చూడకుండా ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్లు అనే 20–20–20 రూల్ ప్రకారం దృష్టిని మళ్లిస్తుండాలి. తరచూ కనురెప్పలు మూస్తూ తెరుస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి. అరచేతుల్ని రుద్ది వెచ్చగా మారాక మూసిన కళ్ల మీద పెట్టుకోవడం వంటి మసాజ్‌లు కూడా సహజమైన పద్ధతిలో ఉపకరిస్తాయి. సుదీర్ఘంగా స్క్రీన్‌ను చూడకుండా ప్రతి అరగంటకూ బ్రేక్ తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment