భట్టిప్రోలు: బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని ఓ అజ్ఞాత వ్యక్తి ఓ మహిళకు ఫోన్ చేశాడు. మీ ఏటీఎం కార్డు గడువు ముగిసిందని, రెన్యువల్ చేయాలంటే కార్డు నంబర్ చెప్పాలని నమ్మించాడు. ఆపై అకౌంట్‌లో ఉన్న రూ.50 వేలు మాయం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భట్టిప్రోలు ఎస్‌ఐ ఇ.బాలనాగిరెడ్డి కథనం ప్రకారం.. స్థానిక కేఎస్‌కే కళాశాల సమీపంలో నివసిస్తున్న షేక్ ఆసియాకు మంగళవారం ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ ఏటీఎం గడువు ముగిసిందని, రెన్యువల్ చేయాలంటే కార్డు నంబర్ చెప్పాలని తెలిపాడు.
నిజంగానే గడువు ముగిసిందని నమ్మిన ఆ మహిళ కార్డు నంబర్‌తో పాటుగా, పిన్ నంబర్ కూడా చెప్పింది. ఆ తర్వాత ఆమె ఫోన్ నంబర్‌కు మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు వచ్చాయా లేదా అని ఆ వ్యక్తి ఫోన్ చేసి మరలా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఇదే అదనుగా భావించి ఆమె ఖాతాలోని రూ.50 వేలను నాలుగు దఫాలుగా ఆన్‌లైన్‌లో డ్రా చేశాడు. నగదు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావటంతో ఆమె అవాక్కయ్యింది. మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment