
పట్టుబడ్డవారిని వారితో ఏఎస్పీ దీపికాపాటిల్, సీఐ రాంబాబు, ఎస్సై ఫకృద్దీన్
సాలూరు: దొంగనోట్లు మారుస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పార్వతీపురం ఏఎస్పీ దీపికాపాటిల్ తెలిపారు. పట్టుబడిన ముఠా సభ్యులను సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో సాలూరులోని గొర్లెవీధికి చెందిన కొండబత్తుల శకుంతల, ఆమె భర్త విశ్వేశ్వరరావు (విజయనగరంలో హోంగార్డు), సాలూ రు మండలం మామిడిపల్లికి చెందిన నల్లి మల్లీశ్వరరావు, నరసింహమూర్తి, సాలూరులో పెదకుమ్మరివీధిలో చెరువుగట్టుకు చెందిన అల్లం శ్యామల మూఠాగా ఏర్పడి దొంగనోట్లను మార్పిడి చేస్తున్నారన్నారు. సాలూరులో ఎలక్ట్రికల్ షాపు నడిపే నల్లి మల్లీశ్వరరావుకు దొంగనోట్ల ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడిందని తెలిపారు.
అయితే అతని వద్ద డబ్బులు లేకపోవడంతో శకుంతల, ఆమె భర్త విశ్వేశ్వరావులకు విషయం చెప్పాడన్నారు. వారితో కలిసి ముఠా సభ్యులను విశాఖలో కలిసి రూ. 1.50 లక్షలు ఇచ్చి మూడు లక్షల రూపాయల (500 రూపాయల నోట్లు) నకిలీ నోట్లు తీసుకున్నట్లు చెప్పారు. అక్కడకు రెండు నెలల తర్వాత నరసింహమూర్తి సహకారంతో శ్యామల నకిలీ నోట్లను మారుస్తూ వస్తోందన్నారు. ఇలా 2 లక్షల 80 వేల రూపాయలను మార్చేశారని తెలిపారు. అయితే మార్చిన మొత్తాన్ని పంచుకునే సమయంలో ఏర్పడిన విభేదాలు ఏర్పడడంతో విషయం బయటకు వచ్చిందన్నారు. దీంతో పట్టణ ఎస్సై ఫకృద్దీన్ విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్దనున్న 40 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇందులో కీలకపాత్ర వహించిన ఒడిశాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకోవాల్సి ఉందని చెప్పారు. కార్యక్రమంలో పార్వతీపురం సీఐ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment