సాక్షి, సిటీబ్యూరో: నుమాయిష్ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు చేసి, అందులో ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన సమాచారాన్ని అక్రమంగా వినియోగించిన కేసు కొలిక్కి వచ్చింది. ఇందుకు బాధ్యుడైన వెబ్‌సైట్ నిర్వాహకుడు డి.మల్లికార్జునరావుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఎర్రగడ్డకు చెందిన మల్లికార్జునరావు కుమారుడు ఆర్టిజం బాధితుడు. దీనిపై అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్న అతను స్మైల్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దీని తరఫున 2017, 2018ల్లో ఎగ్జిబిషన్‌లో స్టాల్ ఏర్పాటు చేశారు. ఏటా నగరంలో నిర్వహిస్తున్న ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను నుమాయిష్‌గా పిలిస్తున్నప్పటికీ దీనికి ఓ ట్రేడ్ మార్క్ లేనట్లు గుర్తించాడు.
దీంతో ముంబైలో ఉండే ట్రేడ్ మార్క్ జారీ సంస్థ నుంచి నుమాయిష్‌కు రిజిస్ట్రేషన్ పొందాడు. వాస్తవానికి ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పగించడానికే ఆయన ఈ ప్రక్రియ పూర్తి చేశాడు. ఇందుకు సంబం«ధించి మల్లికార్జునరావు గతంలో రెండు మూడుసార్లు ఎగ్జిబిషన్ సొసైటీని సంప్రదించి విషయం చెప్పాడు. అయితే వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ ట్రేడ్ మార్క్ ఆయన వద్దే ఉండిపోయింది. ఇదిలా ఉండగా మల్లికార్జునరావు నుమాయిష్ పేరుతో ఓ వెబ్‌సైట్ ( www.numaishonline.com) సైతం రిజిస్టర్ చేయించుకున్న నిర్వహిస్తున్నాడు. ఈ ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారమే జరిగింది.
ఇటీవల ఎగ్జిబిషన్ సొసైటీపై హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్) అతడికి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. 2020 ఎగ్జిబిషన్‌కు సంబంధించి సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో ఉంచాలని భావించిన ఆయన ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన అధికారిక వెబ్‌సైట్ (www.exhibitionsociety.com) నుంచి కాపీ చేసి, తన దాంట్లో పేస్ట్ చేశారు. ఇది 2019 సంవత్సరానికి సంబంధించినది కావడంతో అందులో ఎగ్జిబిషన్‌లో 2900 దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఉంది. అయితే గత ఏడాది ఎగ్జిబిషన్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి పరిమితికి మంచి దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వడమే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టులో కేసులు సైతం దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఎగ్జిబిషన్ సొసైటీ ఈ ఏడాది కేవలం 1500 దుకాణాల ఏర్పాటుకే నోటిఫికేషన్ ఇస్తున్నామని స్పష్టం చేయడంతో పాటు అమలు చేసింది. అయితే నుమాయిష్ వెబ్‌సైట్‌లో 2900 దుకాణాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉండటం, ఇది ఎగ్జిబిషన్ సొసైటీకి చెందినదే అని భావించడంతో ఓ వ్యక్తి దీని ఆధారంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీంతో కోర్టుకు హాజరైన సొసైటీ నిర్వాహకులు నుమాయిష్ వెబ్‌సైట్ విషయం, అందులో ఉన్న సమాచారం తెలుసుకున్నారు. అది తమ అధికారిక వెబ్‌సైట్ కాదని స్పష్టం చేసిన సొసైటీ తమ అనుమతి లేకుండా తమ సైట్‌లోని పాత సమాచారం సంగ్రహించి, దుర్వినియోగం చేసినందుకు నుమాయిష్ వెబ్‌సైట్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు సాంకేతిక ఆధారాలతో మల్లికార్జునరావు బాధ్యుడిగా తేల్చారు. సోమవారం అతడిని సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు పిలిపించి వాంగ్మూలం నమోదు చేశారు. ఆపై ఆయనకు సీఆర్పీసీ 41 (ఎ) ప్రకారం నోటీసులు జారీ చేసి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment