
దొంగస్వామిని పట్టుకున్న పోలీసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడ వెస్ట్): కాషాయం కట్టాడు.. నుదిటిన విభూది రాసాడు.. మెడలో రుద్రాక్ష వేశాడు.. ఆకలి అన్నాడు... నీకు దోషం ఉందన్నాడు.. శాంతి చేస్తా.. ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని నమ్మకంగా చెప్పాడు.. తీరా దగ్గరకు వెళ్లే సరికి మాటలతో మాయ చేశాడు.. మత్తు మందు చల్లినట్లుగా అంతా క్షణంలో జరిగిపోయింది.. తీరా రెండు అడుగులు వేసే సరికి చేతికి ఉన్న బంగారపు ఉంగరం మాయమైంది. ఇదీ దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్ద ఆదివారం ఓ దొంగ స్వామి నిర్వాకం. భక్తుడిని మాయ చేసి ఉంగరాన్ని కాజేయాలని చూసిన దొంగస్వామిని ఆదివారం భక్తులు పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. దొంగస్వామిని పోలీసులు తమదైన శైలిలో విచారించి గతంలో ఇటువంటి ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన వంకాయల శ్రీకాంత్, భార్యతో కలిసి అమ్మవారి దర్శనానికై ఇంద్రకీలాద్రికి విచ్చేశాడు.
ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి నడుచుకుంటూ వెళ్లేందుకు శ్రీకాంత్ కుటుంబం టోల్‌గేటు వద్దకు వచ్చే సరికి మార్గమధ్యలో ఓ సాధువు కనిపించాడు. మెడలో రుద్రాక్షలు, వంటిపై కాషాయంతో ఉన్న ఆ సాధువు ఆకలిగా ఉంది భోజనం పెట్టించండీ అంటూ అటుగా వచ్చి పోయే భక్తులను అడుగుతున్నాడు. దీంతో శ్రీకాంత్ వెంటనే రూ. 50 తీసి సాధువుకు ఇచ్చాడు. అయితే శ్రీకాంత్ చేయి పట్టుకున్న సాధువు నీకు దోషగుణం ఉందని చెప్పాడు. అంతేకాదు శాంతి చేయాలని చెప్పి శ్రీకాంత్‌ను మాటలోకి దింపాడు. చాకచక్యంగా ఉంగరాన్ని లాగేశాడు. తర్వాత కొద్ది నిమిషాలకు శ్రీకాంత్ యథాస్ధితికి చేరుకోగా, భార్య చేతికి ఉంగరం లేదని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన బాధితుడు వెంటనే సాధువును పట్టుకున్నాడు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సీఐ రాజేంద్రప్రసాద్‌కు అప్పగించారు. నిందితుడి సమక్షంలో సాధువును తనిఖీ చేయగా, అతని వద్ద ఉంగరం లభించింది. దీంతో సాధువును వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాధువు వేషంలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన అశోక్‌నాగ్‌గా పోలీసుల విచారణలో తేలింది. అయితే స్టేషన్‌లోనూ దొంగ సాధువు తన మాటల చాతుర్యంలో తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment