కంభం : ఇతర కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ సంఘటన కంభంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం రమణీయపేటకు చెందిన డి.విజయ్ రంజన్, వలవల క్రాంతి తేజ కాకినాడలో బీ ఫార్మసీ చదువుతున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరని తెలుసుకుని సుమారు పది రోజుల క్రితం కాకినాడ నుంచి ఓ కారులో కంభం వచ్చారు. గత నెల 22వ తేదీన రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో వివాహం చేసుకున్న అనంతరం గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు.
అనంతరం కంభంలోని విజయరంజన్ బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. నూతన దంపతులు కంభంలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న క్రాంతితేజ కుటుంబ సభ్యులు మరో 20 మందితో కలిసి గురువారం కంభం వచ్చారు. నూతన దంపతుల కోసం గాలిస్తుండగా తమ ప్రాంతానికి చెందిన నంబర్ ప్లేటుతో ఉన్న కారు వారి కంటపడింది అందులో ఉన్న విజయ్ రంజన్‌ను పట్టుకొని మందలించగా వారిని క్రాంతి తేజ వద్దకు తీసుకొచ్చాడు. అనంతరం క్రాంతితేజ, వారి వద్ద ఉన్న ల్యాప్ టాప్, ఇతర వస్తువులు తీసుకెళ్లిపోయారు. భర్త విజయరంజన్ తన భార్యను ఆమె పెదనాన్న వలవల వెంకటేశ్వర్లు, బాబాయి బాబ్జి, మరో 20 మందికిపైగా రౌడీలు వచ్చి తనపై దాడి చేసి దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వద్ద ఉన్న బంగారు గొలుసు, కెమెరా కూడా తీసుకెళ్లిపోయినట్లు ఫిర్యాదులో బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్‌ఐ వై.శ్రీహరి తెలిపారు. సుమారు పది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీసుస్టేషన్‌లో క్రాంతితేజ కనబడటం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు అక్కడ మిస్సింగ్ కేసు నమోదైందని ఆయన పేర్కొన్నారు. భర్త ఇక్కడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment