
సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు గోవిందరావు(ఫైల్)
శ్రీకాకుళం, సంతకవిటి/రణస్థలం: మందరాడ గ్రామానికి చెందిన వడ్డిపల్లి గోవిందరావు(45) అనే రైతు రణస్థలం వద్ద గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. రణస్థలంలోని జె.ఆర్.పురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఒరుగంటి నరేష్ కుమార్ స్థలంలో ఉరివేసుకొని ఇతడు ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రణస్థలం, లావేరు, సంతకవిటి మండలాల్లో సంచలనం రేపింది. జె.ఆర్.పురం సీఐ ఎ.విశ్వేశ్వరరావు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం స్థానికులు ద్వారా తెలుసుకున్న జె.ఆర్.పురం సీఐ ఎ.విశ్వేశ్వరరావు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన తీరు పరిశీలిస్తుండగా అదే సమయంలో మృతుడు జేబులో ఫోన్ మోగుతుండడంతో ఆ ఫోన్ ఆన్ చేసి సంబంధిత వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని సీఐ తెలిపారు. కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించారు. బుధవారం రాత్రి వరకు ఈయన ఇంటి వద్దే ఉన్నాడు. గత రెండు రోజులుగా మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో ఈయనను కుటుంబీకులు గురువారం ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇంతలోనే ఈయన ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈయన వ్యవసాయం చేసుకోవడంతో పాటు వరిగడ్డి వ్యాపారం చేసేవాడు. గతంలో మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ రెండు రోజుల క్రితం నుంచి ఇబ్బంది పడుతూవచ్చాడు. ఈయనకు భార్య చిన్నమ్మడుతో పాటు కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తె పావనికి రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం అత్తవారి ఇంటి వద్ద ఉంటుంది. గోవిందరావు మృతిచెందిన విషయం తెలుసుకొని గ్రామస్తులు శ్రీకాకుళం రిమ్స్‌కు చేరుకున్నారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా మృతదేహంతో పాటు బంధువులు, గ్రామస్తులు స్వగ్రామానికి చేరుకొని గోవిందరావు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య చిన్నమ్మడు కన్నీరుమున్నీరుగా విలపించింది. నాన్నా లే నాన్న అంటూ గోవిందరావు కుమార్తె పావని తండ్రి మృతదేహంపడి విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తన తండ్రి మృతదేహం వద్ద కుమారుడు మణికంఠ గట్టిగా రోదించగా అదుపుచేయడం ఎవరి తరమూకాలేదు. గోవిందరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గోవిందపై కేసు నమోదు
కాగా, కొన్నాళ్లు క్రితం సంతకవిటీ పోలీస్ స్టేషన్‌లో మృతుడిపై కేసు నమోదైందని సీఐ తెలిపారు. భార్యతో గొడవలు, గతంలో ఇదే స్థలంలో పురుగు మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడడం, ఎనిమిది నెలల క్రితం పొందూరు రైల్వే పట్టాలపై పడుకొని అత్మహత్యాయత్నానికి పాల్పడం వంటి సంఘటనలు ఉన్నాయని చెప్పారు. మానసిక స్థితి బాగోలేక జె.ఆర్.పురం పరిధిలోకి వచ్చి చెట్టుకు తువ్వాలతో ఉరివేసుకొని అత్మహత్యకు పాల్పడి ఉంటాడని సీఐ తెలిపారు. మృతదేహానికి శవపంచనామా నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై బి.ఆశోక్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment