సాక్షి, న్యూఢిల్లీ : యూఐడీఏ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఓ పాకిస్థానీ ఆధార్ కార్డుతో పట్టుబడటం కలకలం రేపింది. భారత పౌరసత్వం లేకపోయినా ఆధార్ కార్డు ఎలా జారీ చేశారన్న అంశంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లితే... పాకిస్థాన్‌కు చెందిన పుర్ఖా రామ్ 2000 సంవత్సరంలో పాక్ నుంచి రాజస్థాన్‌కు వచ్చి స్థిరపడ్డాడు. కూలీ పనులు చేసుకునే రామ్.. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ క్రమంలో గత నెలలో జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అతను తచ్చాడుతుండగా భద్రతా సిబ్బంది గమనించారు. అనుమానంతో అతని బ్యాగ్ తనిఖీ చేయగా వారికి అందులో పాకిస్థాన్ పాస్‌పోర్టు, ఆధార్ కార్డు దర్శనమిచ్చాయి. వెంటనే అప్రమత్తమై అతని అరెస్ట్ చేశారు.
పోలీసులతోపాటు పలు భద్రతా ఏజెన్సీలు అతన్ని సుదీర్ఘంగా ప్రశ్నించాయి. కానీ, విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూడకపోవటంతో చివరకు అతన్ని వదిలేశారు. అయినప్పటికీ పౌరసత్వం లేకపోయినా ఆధార్ కార్డును కలిగి ఉండటంతో అతనిపై విజయ్‌నగర్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రామ్‌కు ఆధార్ కార్డు ఎలా మంజూరు అయ్యింది? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
జాతీయత, వ్యక్తిగత వివరాలు తదితర అంశాలను తగిన పత్రాలతో ధృవీకరించుకున్నాకే ఆధార్ కార్డును యూఐడీఏ మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, అందుకు విరుద్ధంగా ఏజెంట్లు అతనికి కార్డు ఎలా ఇచ్చారన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.
Comments
Please login to add a commentAdd a comment