అంతర్‌ జిల్లా నేరస్తుడి అరెస్టు∙   | four were arrested | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా నేరస్తుడి అరెస్టు∙  

Published Wed, Apr 18 2018 12:23 PM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

four were arrested  - Sakshi

నిందితుడు శ్రీనాథ్‌ను విలేకర్ల ముందు ప్రవేశపెట్టిన అమలాపురం రూరల్‌ సీఐ దేవకుమార్, ఎస్సైలు

అమలాపురం రూరల్‌: ముఖానికి ముసుగులతో ఓ ఇంట్లోకి చొరబడి... డ్రైవర్‌ను కత్తులతో బెదిరించి, నిర్బంధించి దోపిడీకి విఫలయత్నం చేసిన కేసులో నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన 24 ఏళ్ల అంతర్‌ జిల్లాల నేరస్తుడు జొన్నలగడ్డ శ్రీనాథ్‌ను అమలాపురం రూరల్‌ సీఐ జి.దేవకుమార్‌ అరెస్ట్‌ చేశారు. స్థానిక రూరల్‌ పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో అరెస్ట్‌ చేసిన నిందితుడు శ్రీనాథ్‌ను మంగళవారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు.

కేసు వివరాలను ఆయన వివరించారు. అమలాపురం రూరల్‌ మండలం బండార్లంక గ్రామంలో పేరి శంకరరావు ఇంట్లోకి గత మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి మారణాయుధాలతో తలుపులు పగులగొట్టి ప్రవేశించారు. ఇంటి హాలులో నిద్రిస్తున్న డ్రైవర్‌ పీక నొక్కి...నిర్బంధించి ఇంట్లో ఎక్కడ బంగారు నగలు, డబ్బులు దాచారో చెప్పు అంటూ కత్తులు చూపి బెదిరించారు.

ఇంతలో కంగారు పడ్డ డ్రైవర్‌ కేకలు వేయడంతో ఐదుగురు ముసుగు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం అరెస్ట్‌ చేసిన శ్రీనాథ్‌ ఐదుగురు ముఠాలో ఒకడని సీఐ చెప్పారు. మిగిలిన నలుగురు సభ్యుల్లో ఒకడైన స్వగ్రామం అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామం. శ్రీనాథ్‌ తమ ముఠాలోని సహచరుడైన కె.పెదపూడికి చెందిన వెంకటపతిరాజు అనే నానిని కలిసేందుకు సోమవారం ఆ గ్రామం వెళ్లాడు.

అయితే నానితో పాటు మిగిలిన సహచరులైన, అంతర్‌ జిల్లాల చోరీ కేసుల్లో నేరస్తులైన కృష్ణంరాజు అనే రాజేష్, నడింపల్లి సుబ్బరాజు అనే మహేష్‌లను భారీ చోరీ కేసుల్లో రాజోలు పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి తిరుగుముఖం పట్టి కె.పెదపూడి గ్రామంలోని రావులమ్మ అమ్మవారి గుడి వద్ద ఉన్న జొన్నలగడ్డ శ్రీనాథ్‌ను రూరల్‌ సీఐ దేవకుమార్‌ ముందస్తు సమాచారంతో మాటు వేసి తన సిబ్బంది, మధ్యవర్తుల సమక్షంలో పట్టుకున్నారు.

ఈ కేసులో ఐదో నిందితుడైన నెల్లూరు జిల్లాకు చెందిన మారుబోయిన మాల్యాద్రి గురించి పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సీఐ చెప్పారు. ఈ ఐదుగురు నిందితులు పలు జిల్లాల్లో చోరీలు చేయడం ప్రవృత్తి. వీరు పలు చోరీ కేసుల్లో అరెస్ట్‌ అయి సబ్‌ జైళ్లలో రిమాండు అనుభవిస్తున్నప్పుడు ఏర్పడిన స్నేహంతోనే కోనసీమలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.

ఐదుగురిలో ముగ్గురిని రాజోలు పోలీసులు, ఒకడిని అమలాపురం రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో దాదాపు ఈ దొంగల ముఠాను నిరోధించినట్టయ్యింది. మిగిలిన ఐదో నిందితుడి కోసం నెల్లూరు జిల్లాకు పోలీసు బృందాలను పంపించారు. శ్రీనాథ్‌ను అరెస్ట్‌ చేయడంలో సహకరించిన అల్లవరం, అమలాపురం తాలూకా ఎస్సైలు ప్రశాంత్‌కుమార్, గజేంద్రకుమార్, క్రైం పార్టీ హెడ్‌ కానిస్టేబుల్‌ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుల్‌ లంకాడి శ్రీనులను సీఐ దేవకుమార్‌ అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement