గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగ సర్టిఫికెట్లు సృష్టించిన ముగ్గురు వ్యక్తులపై ఆస్పత్రి పాలనయంత్రాంగం బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..తెలంగాణ జిల్లాలతోపాటు నగరంలోని పలు పారామెడికల్ కాలేజీలకు చెందిన విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలో మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్ (ఎంపీహెచ్‌డబుŠల్య్), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంటీఎల్)లుగా ఏడాది పాటు శిక్షణ పొందుతుంటారు. వారికి ఆస్పత్రి అధికారులు సర్టిఫికెట్ జారీ చేస్తారు. సదరు సర్టిఫికెట్‌తో తెలంగాణ పారామెడికల్ బోర్డులో పేర్లు నమోదు చేసుకుంటే ప్రాధాన్య క్రమంలో అర్హులైన వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాల్వంచ కేఎల్‌ఆర్ ఓకేషనల్ జూనియర్ కాలేజీకి చెందిన రంభ రమాదేవి, మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి చెందిన ధరావత్ నీలిమ, ఇబ్రహీంపట్నం శ్రీ విద్యాంజలి ఒకేషనల్ జూనియర్ కాలేజీకి చెందిన చందు గాంధీ ఆస్పత్రిలో ఎంఎల్‌టీగా శిక్షణ పొందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దొంగ సర్టిఫికెట్లు సృష్టించారు.
వీటి ఆధారంగా పారామెడికల్ బోర్డులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇతర విద్యార్థుల సర్టిఫికెట్లతో సరిపోలిస్తే వీరి సర్టిఫికెట్లలో తేడా గుర్తించిన పారామెడికల్ బోర్డు అధికారులు వివరణ కోరుతూ గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగానికి పంపించారు. రికార్డులను పరిశీలించిన అధికారులు సదరు విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలో శిక్షణ తీసుకోలేదని స్పష్టం చేస్తూ పారామెడికల్ బోర్డు అధికారులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతకం ఫోర్జరీ చేయడంతోపాటు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన రమాదేవి, నీలిమ, చందులపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ రాజునాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment