
శిరీష మృతదేహం
చెల్లితో గొడవ పడవద్దని తల్లి మందలించిందన్న కారణంతో మనస్తానికి గురై ఎస్.రాయవరం మండలం చిన ఉప్పలం గ్రామానికి చెందిన సాయి అశ్రిత్ అనే 13 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని రోజు గడవక ముందే మరో బాలిక బలవన్మరణానికి పాల్పడింది. తల్లిమందలించిందన్న కారణంతో అనకాపల్లి మండలంలో ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అనకాపల్లి: చిన్నపాటి కారణానికే మనస్తాపానికి గురై క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దుస్తులు వేసుకునే విషయంలో తల్లి మందలించడంతో బలన్మరణం చెందింది. రూరల్ ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వెంకటపతి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రేబాక శివారు కాపుశెట్టివానిపాలెంకు చెందిన బాలరాజు, శాంతిల కుమార్తె శిరీష(15) సబ్బవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో చుడీదార్ వేసుకొని గుడికి వెళతానని శిరీష తన తల్లికి చెప్పింది.
దీనికి తల్లి శాంతి అభ్యంతరం చెప్పి, గుడికి వెళ్లేటప్పుడు లంగా ఓణీ ధరించాలని సూచించింది. దీనికి మనస్తాపం చెందిన శాంతి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. శిరీష గదిలోంచి బయటకు రాని విషయాన్ని 11.30 సమయంలో గమనించిన కుటుంబ సభ్యులు తలుపును బలంగా తోయగా ఉరివేసుకొని ఉంది. దీంతో వారు భోరున విలపించారు. క్షణికావేశంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.