ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: భార్య, అత్తమామల వేధింపులతో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..ఉప్పల్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఎల్దండ ఆనంద్, లత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు (2) ఉంది. నెలక్రితం లత తన భర్త కుటుంబసభ్యులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. (ఫ్లై ఓవర్‌పై ఆత్మహత్య.. భార్యే కారణం)
ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఆనంద్ ఇంట్లోంచి బయటకు వెళ్లగానే కూతురును తీసుకొని లత ఇంటికి తాళం పెట్టి వెళ్లిపోయింది. ఆనంద్ మద్యం తాగి వచ్చి చూసేసరికి ఇంటికి తాళం ఉంది. చుట్టుపక్కల వెతికి పక్కనే ఉన్న అత్తగారింట్లోకి వెళ్లి ఆరాతీయగా వారు దుర్భాషలాడారు. దీంతో మనస్థాపం చెందిన ఆనంద్ బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లి భార్య, అత్తమామలు చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటిచుకున్నాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కన్నతండ్రే 'కర్కోటకుడు')
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
చిలకలగూడ : ఆరేళ్ల క్రితం ఎంటెక్ పాసయ్యాడు. అప్పటి నుంచి చెప్పులు అరిగేలా తిరిగినా సరైన ఉద్యోగం రాలేదు. ఇంత చదువు చదివి ఇంట్లోవాళ్లకు భారం కావడం ఇష్టం లేదనుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారకమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బౌద్ధనగర్ వారాసిగూడకు చెందిన పల్లే సుధీర్‌రెడ్డి (29) ఎంటెక్ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఎన్ని ఇంటర్వూలకు వెళ్లినా సరైన ఉద్యోగం లభించలేదు. గత నెల 29న ఉదయం 11.30 గంటలకు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు.
సోదరుడు రణధీర్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, అదృశ్యమైన సుధీర్ ఫోటోను అన్ని పోలీస్, రైల్వేస్టేషన్లకు పంపించారు. ఈ నేపధ్యంలో ఈనెల 1వ తేదిన జామై ఉస్మానియా, ఆర్ట్స్ కాలేజీ రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కాచిగూడ రైల్వేపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులు పంపిన ఫొటోతో సరిపోల్చుకుని, కుటుంబసభ్యులకు సమాచారం అందించగా మృతుడు సుధీర్‌రెడ్డిగా గుర్తించారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment